తమిళనాడు రాష్ట్రంలోని కూడలూరు అనే ప్రాంతం సమీపంలో ఎరుపు రంగుతో కూడిన వర్షం కురిసింది. వర్షపు నీరు రంగు మారటంతో ఆశ్చర్యపోవటం స్థానికుల వంతు అయింది. సోమవారం రోజు రాత్రి సమయంలో నీలగిరి జిల్లా కూడలూరు ప్రాంతం సమీపంలోని నాడుకాని గ్రామంలో గంటకు పైగా వర్షం కురిసింది. ఈ నీటిలో తడిసిన ప్రజలకు శరీరంపై దురదలు వస్తున్నాయి. వర్షంలో తడిస్తే దురదలు రావటంతో ప్రజలు భయపడుతున్నారు. 
 
నాడుకాని గ్రామంతో పాటు కూవత్తిపొళిల్, ముండా ప్రాంతాలలో కూడా ఎరుపు రంగు వర్షం కురిసింది. కొందరు ప్రజలు వర్షపు నీటిని పాత్రలు, బాటిల్స్ లో దాచుకున్నారు. ఈ విషయం తెలిసిన ఇతర గ్రామాల ప్రజలు ఈ గ్రామాలకు చేరుకొని ఎరుపు రంగు నీటిని ఆసక్తిగా చూస్తున్నారు. కొందరు ఈ వింతను చూసి ఆశ్చర్యపోతున్నారు. రెవెన్యూ శాఖ అధికారులకు ఈ సమాచారం తెలియటంతో నాడుకాని గ్రామానికి చేరుకొని పరిశోధనల కోసం నీటిని తీసుకొనివెళ్లారు. 
 
ఇలాంటి ఎరుపు రంగు వర్షం పడటం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా కేరళ రాష్ట్రంలో ఎరుపు రంగు వర్షం కురిసింది. 2001 సంవత్సరంలో కేరళలో కొన్ని ప్రాంతాలలో ఎరుపు రంగు వర్షం పడిందని సమాచారం. ఆ సమయంలో ప్రజలు ఎరుపు రంగులో వర్షాన్ని చూసి విపరీతంగా భయపడ్డారు. ఈ విషయంపై ఎన్నో పరిశోధనలు చేసిన తరువాత శాస్త్రవేత్తలకు అసలు విషయాలు తెలిసాయి. 
 
ఒక రకమైన జీవికి చెందిన స్పోర్స్ అధిక మొత్తంలో వర్షపు నీటిలో కలిస్తే వర్షపు నీరు ఎరుపు రంగులోకి మారుతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తెలిసింది. 19వ శతాబ్దానికి పూర్వం కూడా కేరళ రాష్ట్రంలో ఎరుపు రంగు వర్షాలు పడ్డాయి. ఇప్పటివరకు కేరళలో మాత్రమే పడిన ఎరుపు రంగు వర్షాలు ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో కూడా పడుతున్నాయి. పర్యావరణం విషయంలో మనుషులు చేస్తున్న తప్పుల కారణంగానే ఎరుపు రంగు వర్షాలు కురుస్తున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: