కాలం మారుతున్న మనుషులు మాత్రం మారడం లేదు.. టెక్నాలజీ మీద నడిచే ఈ కాలంలో కూడా చేతబడులు చేశారంటూ మనుషులను సజీవదహనం చేస్తున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ మేడ్చల్ లో ఓ యువకుడు చేతబడి చేశాడని సజీవదహనం చేస్తే ఈరోజు విశాఖ జిల్లాలో సభ్యసమాజం సిగ్గుపడేలా చేతబడి చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని నాలుగు గంటల పాటు హింసించి సజీవదహనం చేశారు.    


వివరాల్లోకి వెళ్తే .. డుంబ్రిగూడ మండలం పుట్టంబంద గ్రామానికి చెందిన జయరాం అనే వ్యక్తి చేతబడి చేస్తున్నాడని గ్రామంలో కొంత కాలం నుంచి ప్రచారం సాగింది. చేతబడి చేశాడనే అనుమానంతో గ్రామస్తులు జయరాంను గమనించారు. అయితే ఇటీవల గ్రామంలో అనుకోని రీతిలో కొన్ని మరణాలు సంభవించడం, కొంతమంది అనారోగ్యం పాలు కావడంతో వీటన్నిటీకీ కారణం జయరాం అని, అతడు చేతబడి చేయడంతోనే ఈ ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు అనుమానించారు.    


ఈ నేపథ్యంలో బుధవారం గ్రామంలో పంచాయితీ ఉందని, రావాలని ఆదేశించారు. పంచాయితీకి వెళ్లగా అక్కడ ఎవరు లేరని జయరాం, అతని కుటుంబసభ్యులు వెనుదిరిగారు. అనంతరం గ్రామస్తులే వారి ఇంటికి వచ్చి జయరాంను పట్టుకుని కర్రలతో విచక్షణారహితంగా నాలుగు గంటల పాటు కొడుతూ హింసించారు. కొనఊపిరితో ఉన్న జయరాంను గ్రామం నడిబొడ్డులో చితిపేర్చి పెట్రోలు పోసి సజీవదహనం చేశారు.   


కుటుంబసభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారిని చంపేస్తామని బెదిరించారు. వారు రాత్రికి రాత్రే ఊరు వదిలి పారిపోయారు. ఈ ఘోరమైన ఘటన గురించి పోలీసులకు తెలియడంతో ఈ సజీవ దహనానికి కారణమైన కొంతమందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా కాలం మరీనా మనుషులు మారడం లేదు అనడానికి ఇది మరో సాక్షి.   


మరింత సమాచారం తెలుసుకోండి: