ఏపీలో విప‌క్ష తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి రోజు రోజుకు దిగ‌జారుతూ వ‌స్తోంది. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి నాలుగు నెల‌లు కూడా కాకుండానే ప‌లువురు ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఈ ఎన్నిక‌ల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వారు ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. ఇప్ప‌టికే న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలో చేరిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉండ‌గానే ఎన్నిక‌ల్లో ఓడిపోయిన నేత‌లు కూడా బీజేపీలోకో లేదా వైసీపీలోకో వెళ్లిపోతున్నారు.


అనంత‌పురం జిల్లాలో కీల‌క నేత‌గా ఉన్న ధ‌ర్మ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి బీజేపీలో చేరిపోయారు. అలాగే గుంటూరు జిల్లా బాప‌ట్ల నుంచి ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్సీ అన్నం స‌తీష్ ప్ర‌భాక‌ర్ సైతం టీడీపీకి గ‌ట్టి షాక్ ఇచ్చి బీజేపీలోకి వెళ్లిపోయారు. ఇక విశాఖ జిల్లా అనకాప‌ల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిన అడారి ఆనంద్‌కుమార్ సైతం వైసీపీ కండువా క‌ప్పేసుకున్నారు.


ఇక తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన మ‌రో సీనియ‌ర్ నేత తోట త్రిమూర్తులు వైసీపీలోకి వెళ్లిపోగా.. ప్ర‌త్తిపాడు నుంచి ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన వ‌రుపుల రాజా సైతం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు మ‌రో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పంచకర్ల రమేశ్ బాబు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. విజయదశమి రోజు (అక్టోబరు 8)న ఆయన వైసీపీ కండువా కప్పుకునేందుకు ముహుర్తం పెట్టుకున్నట్టు తెలిసింది.


ర‌మేశ్‌బాబు 2009లో ప్ర‌జారాజ్యం నుంచి పెందుర్తి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొన‌సాగిన ఆయ‌న 2014 ఎన్నిక‌ల‌కు ముందు గంటాతో పాటు టీడీపీలోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి మ‌రోసారి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఈ ఎన్నిక‌ల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేయాల‌ని అనుకున్నా సాధ్యం కాలేదు. దీంతో య‌ల‌మంచిలిలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం వైపీపీలోకి వెళ్లిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: