గడచిన కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలో జనజీవనం అతలాకుతలమైంది. హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపిస్తుండగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కూడా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 
 
అనంతపురం జిల్లాలోని యాడికి మండలంలో కూడా భారీగా వర్షాలు పడ్డాయి. ఇప్పటికే వర్షాలతో అతలాకుతలం అవుతున్న ప్రజలకు హికా తుఫాను రూపంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. హికా తుఫాను రాకతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ తుఫానుకు కారణమయింది. 
 
భారతదేశం అంతటా 17 రాష్ట్రాల్లో హికా తుఫాను కారణంగా వర్షాలు కురవనున్నాయి. అరేబియా సముద్రం తీరంలో గంటకు 75 నుండి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ చెబుతుంది. దక్షిణ భారతదేశంలోని కేరళ, పుదుచ్చేరి, కర్ణాటక, తమిళనాడు రాష్టాల్లో కూడా రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 
 
వాతావరణ శాఖ అధికారులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. హికా తుఫాను గురించి వస్తున్న వార్తలు ప్రజల్ని భయపెడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలలో రహదారిపై వరద నీరు భారీగా పారుతోంది. చాలా ప్రాంతాలలో వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది. గోవా, మహారాష్ట్ర, మేఘాలయ, అస్సాం రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. 


 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: