నేటి సమాజంలోని మానవుడు మమతలు, మానవత్వం, ప్రేమ, జాలి, దయ, కరుణ వంటివి పూర్తిగా మరిచిపోతున్నారు అని అనడానికి ప్రస్తుతం జరుగుతున్న అనేక సంఘటనలే సాక్ష్యం. వాటివల్లనే ఎందరివో జీవితాలు ఛిద్రం అవుతున్నాయి అనేది తెలిసిందే. అనాధ అయిన ఒక వ్యక్తి, జీవితం మీద విరక్తి కలిగి తనకు తానే బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే అనాధ అవడం చేత, తనకు అంత్యక్రియలు చేసేవారు ఎవరూ ఉండరని, అలానే తన అంత్యక్రియలకు డబ్బుల కోసం మరొకరు ఇబ్బంది పడకూడదని భావించి, తన అంత్యక్రియలకు తానే ముందుగానే విరాళం ఇచ్చుకుని, ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నేడు అందరి మనసులను కలచి వేస్తోంది. ఇక  అసలు వివరాల్లోకి వెళితే, 

నిజామాబాద్ జిల్లా గాంధీనగర్ తండాకు చెందిన 26 ఏళ్ళ బొంతు విజయ్ కుమార్ చిన్నతనంలోనే తన తల్లితండ్రులను కోల్పోవడం జరిగింది. అయినప్పటికీ స్వశక్తితో ఎంతో కష్టపడి డిగ్రీ పూర్తి చేసిన విజయ్, ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి, కృష్ణ నగర్ ప్రాంతంలో అద్దెకు ఉంటూ, టాక్సీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే అదే సందర్భంలో సర్వ్ నీడి (అనాధలకు అంత్యక్రియలు నిర్వహించే సంస్థ) ప్రతినిధి గౌతమ్ కుమార్ తో విజయ్ కు మంచి అనుబంధం ఏర్పడడంతో, తనకు ఎవరూ లేరని మానసికంగా ఎంతో ఆవేదన అనుభవిస్తున్నట్లు గౌతమ్ కు ఎప్పుడూ చెప్పుకుని బాధపడేవాడు విజయ్. అంతేకాక విజయ్ గతంలో ఒకసారి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడి చివరకు బ్రతికాడు. 

ఇక తనకంటూ ఎవరూ లేరని జీవితం మీద విరక్తి కలిగి చివరకు ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. అయితే తాను చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ఉండరని భావించిన విజయ్‌, ఈ నెల 22న అదే సర్వ్‌నీడీ స్వచ్ఛంద సంస్థకు, రూ.6 వేల విరాళం అందజేసి ఎవరైనా అనాథకు విరాళంగా ఈ డబ్బుతో అంత్యక్రియలు చేయాలని కోరాడు. కాగా ఆ తర్వాత రెండు రోజులకే అతను బేగంపేట రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అతడి జేబులో సూసైడ్ నోట్ పోలీసులకు దొరికింది, తాను చనిపోయిన 12 గంటల్లోపు పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగాలని, అలానే తన పెద్దమ్మ కుమారుడైన సందీప్‌కు సమాచారం అందించాలని సూసైడ్‌ లో తెలిపాడు విజయ్

ఇంకా ఏమైనా సహాయం కావాలంటే తన స్నేహితుడైన డాక్టర్‌ విజయ్‌ను సంప్రదించాలని ఆ డాక్టర్‌ ఫోన్ నంబర్‌ కూడా రాసాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని, తనకు జీవించడం ఇష్టం లేకనే ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, కాబట్టి తన గురించి ఎవరూ బాధపడవద్దని కూడా ఆ లేఖలో రాసాడు విజయ్. ఈ విధంగా తాను చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండాలని భావించి, ఎంతో  గొప్ప మనసుతో విజయ్‌, అంతకుముందే రూ.6 వేల విరాళాన్ని సదరు సర్వ్‌నీడి సంస్థకు అందజేయడం, సంస్థ సభ్యులతో పాటు ప్రజలను కూడా కలిచివేస్తోంది. ఎన్ని ఉన్నప్పటికీ, మన అనుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేకపోతే ఎంతటి వ్యక్తి అయినా మానసికంగా కృంగిపోతాడు అనడానికి విజయ్ జీవితమే నిదర్శనమని, కావున మన తోటి మనిషి విలువను మానవత్వంతో గ్రహించి, అందరూ మనవారే అనుకుని కలిసి మెలిసి జీవిస్తే ఇటువంటి బలవన్మరణాలు ఉండవని అంటున్నారు మానసిక నిపుణుల....... !!   


మరింత సమాచారం తెలుసుకోండి: