హుజూర్ నగర్ ఉప ఎన్నికను టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  ఈ ఎన్నికల్లో గెలుపు టిఆర్ఎస్ ఎంతో ముఖ్యం .అందుకే అందుబాటు లో అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది . హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పొరుగునే ఉండడం తో , ఈ ప్రాంతం లో వైకాపా మద్దతుదారుల సంఖ్య అధికమే. అందుకే ఈ ఎన్నికల్లో వైకాపా మద్దతు కూడగట్టే ప్రయత్నాన్ని టీఆరెస్ అధినేత కేసీఆర్ చేస్తున్నట్లు తెలుస్తోంది .   2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.


 అయితే ఆ  ఎన్నికల్లో  ట్రక్కు గుర్తు ఉండడం వల్లే తాము ఓటమిపాలయ్యామని టిఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు.  ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్ సభ  స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించడంతో,  తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు.  ఉత్తమ్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి వచ్చేనెలలో  ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.  ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ , సతీమణి పద్మావతి రెడ్డి పోటీ చేస్తున్నారు.  ఇక టిఆర్ఎస్ నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన సైది రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు . ఇక  బిజెపి నుండి శ్రీకళారెడ్డి బరిలోకి దిగనున్నారు.


  అయితే 2014 ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా ఆ పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పోటీ చేశారు.  అప్పట్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు.  స్థానికంగా ఇప్పటికి  వైకాపా కు గట్టి మద్దతుదారులుండడం తో వారి మద్దతును  టిఆర్ఎస్ నాయకత్వం కూడగట్టే ప్రయత్నాలు చేస్తోంది . ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని  ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు అనుకూలంగా మలచుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: