తెలుగు రాష్ట్రాలను వరుణ శాపం వెంటాడుతోంది. వానలు లేక చాన్నాళ్ళు అల్లాడిన చోట ఇపుడు జలప్రళయమే ముంచెత్తుతోంది. బోరున వానతో నింగీ నేల ఏకమైపోతున్నాయి. చినుకు కోసం కునుకు మానేసి మరీ ఆకాశం వైపు చూసిన వారికి ఇపుడు గగనమే చిల్లులు పడిందా అన్నంతగా వాన కురుస్తోంది. భారీ వర్షాలు, కుండపోత వానలు, కుంభవ్రుష్టితో తెలుగు నేలలు తల్లడిల్లిపోతున్నాయి.


ఇంట్లోంచి బయటకు రావాలంటే భయం. బయటవారు కొంపకు చేరాలంటే అదో పెద్ద సాహసం. సాక్ష్తాత్తూ  మంత్రి కేసీయార్  హైదరాబాద్ జల ట్రాఫిక్ లో చిక్కుకున్న ఘటన జరిగింది. ఇక మనకు మనమే మురిసిపోయి కట్టుకున్న ఆకాశ హర్మ్యాలు,  ఫ్లై ఓవర్లు ఎంత సెక్యూరిటీ అన్నది కూడా భారీ వాన తేల్చేస్తోంది. గట్టిగా తుమ్మితే చాలు వూడిపోయే ముక్కు చందంగా భారీ వానలకు మెట్రో నిర్మాణాలు కదులుతున్నాయి. పెచ్చులూడుతున్నాయి.



వాన వచ్చిందని తలదాచుకుంటే మెట్రో గోడల‌ పెచ్చులు వూడి పడి చనిపోయిన మౌనిక కధలను కూడా గుర్తుకు తెచ్చేలా వానలు పడుతున్నాయి. మ్యాన్ హోల్స్ నోళ్ళూ ఎక్కడ బార్లా తెరచుకుని పాతాళానికి ప్రాణాళను దిగలాగేస్తాయోనని భయం కూడా ఉంది. హుస్సేన్ సాగర్ పొంగి పొరలుతుందా అన్న భీతి కూడా కలుగుతోంది. అలా ఇలా కురవడంలేదు వానలు, వరదలై, ఏరులై పారుతున్నాయి. పని లేని వారికి పస్తులు తెప్పిస్తున్నాయి. రైతుల పంటలను చేలలో ముంచేస్తున్నాయి. ఆఫీసుకు వెళ్ళేవారికి సైతం ట్రాఫిక్ కష్టాలు పెట్టేస్తున్నాయి.


వాన అంటూ ఆశగా చూసిన వారికి వరుణుడు కరుణించాడా, శపించాడా అన్నది తెలియనంతగా వాన వెల్లువలా కురుస్తోంది. హైదరాబాద్ లో వాన పడితే ఇక ఒక్క చుక్క కూడా మోయలేనంటోందంటే చూడాలి మరి నగరవాసి కష్టాలు, కడగండ్లు. ఈ వానలకు తోడు హీకా తుపాను కూడా సైరన్ మోత మోగిస్తోంది.మరి అది కూడా తోడు అయితే దంచి కొట్టే వానలకు జన జీవనం ఏమైపోతుందో అని తెలుగు జనం గుప్పిట  ప్రాణాలను పెట్టుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: