జర్నలిజంలో ఓ సామెత ఉంది. కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు.. మనిషే కుక్కను కరిస్తే వార్త.. అని. సరిగ్గా అలాంటి సంఘటనే అమెరికాలోని లూసియానాలో జూలో జరిగి వార్తగా మారింది. జూలో జంతువులను చూసేందుకు వెళ్లిన ఓ మహిళ.. ఒంటె వృషణాలను కొరికి పెద్ద వార్త చేసింది. గ్లోరియా లాంకాస్టర్ (68), ఎడ్మండ్ లాంకాస్టర్ (73) అనే జంట తమ పెంపుడు కుక్కతో టైగర్ ట్రక్ షాప్‌లో ఒంటెలను చూసేందుకు వెళ్లారు. అక్కడ ఒంటెల ఎన్‌క్లోజర్‌లోకి తమ పెంపుడు కుక్కను వదలగా ఓ ఒంటె ఆ కుక్కపై దాడి చేసింది. దీంతో కుక్కను కాపాడేందుకు ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన ఆ జంటపై కూడా ఒంటె దాడి చేసింది.

 

 

 

అయితే ఈ హడావిడిలో గ్లోరియా భయపడి ఆ ఒంటె పైకెక్కి కూర్చుంది. ఆమెను రక్షించేందుకు వెళ్లిన ఆమె భర్త ఎడ్మండ్ పై కూడా ఒంటె దాడి చేసి అతని చేతిని కరిచింది. దీంతో కోపొద్రిక్తురాలైన గ్లోరియా తనకు దగ్గరగా ఉన్న ఆ ఒంటె వృషణాలను గట్టిగా కొరికేసింది. ఒంటె పైకి లేచేవరకు ఆమె అక్కడ కరుస్తూనే ఉంది. ఇది గమనించిన ఆ జూ నిర్వాహకులు వచ్చి గ్లోరియాను, ఒంటెను రక్షించారు. గ్లోరియా ఒంటెను కొరకడంతో దానికి అత్యవసర చికిత్స అందించారు. ఆమె పంటి గాయాల వల్ల ఒంటెకు ఎటువంటి అనారోగ్యం రాకుండా యాంటీబయోటిక్స్ ఎక్కించారట. 

 

 

 

ఈ ఘటనలో ఎడ్మండ్ చేతికి గాయమవగా.. ఒంటెకు మాత్రం అక్కడ తీవ్ర గాయమైంది. ఒంటె దాడిలో గాయపడిన ఎడ్మండ్ కు కూడా వైద్యులు కొన్ని యాంటీబయోటిక్స్ ఇచ్చి ఇంటికి పంపేశారు. దీంతో ఈ వార్త ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఎక్కడా చోటు లేనట్లు ఆమె అక్కడే ఎందుకు కొరికిందంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: