రోజుకో ప్రకటన... పూటకో హెచ్చరికలతో భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య పరిస్థితులు అత్యంత సున్నితంగా మారిన సమయంలో రెండు దేశాల ప్రధానులు ఒకే వేదికపై కనిపించనున్నారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ లో సెప్టెంబర్ 27న  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ప్రసంగించనున్నారు. సరిగ్గా ఆ రోజే  పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రసంగించనున్నారు. మోదీ ప్రసంగం తర్వాత ఇమ్రాన్ ఖాన్ స్పీచ్ ఉండబోతోంది.


భారత్, పాక్‌ దేశాల మధ్య ఓ దశలో యుద్ధం వస్తుందేమో అనేంత చర్చనడిచింది. కొంత కాలంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కశ్మీర్ కు ప్రత్యేక హోదాను ఇచ్చే ఆర్టికల్ 370రద్దు తర్వాత పాకిస్తాన్ భారత్ పై కారాలు మిరియాలు నూరుతోంది. అదే సమయంలో మద్ధతు అంతర్జాతీయ సమాజం వైపు చూసినా పెద్దగా ఫలితం లేకపోయింది.  ఒకానొక సందర్భంలో రెండు దేశాల మధ్య  అణు యుద్ధంపై ఛాలెంజ్‌ లు కూడా నడిచాయి. ఇప్పటికీ పరిస్థితులు దాదాపుగా అలాగే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇరు దేశాధినేతలు ఒకే వేదికపై ఒకే రోజున కనిపించనున్నారు. 


ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ 74వ సెషన్ సాధారణ చర్చ కోసం వివిధ దేశాధినేతలు ప్రసంగిస్తారు. ఇందులో భాగంగానే శుక్రవారం నాడు మోదీ, ఇమ్రాన్ ప్రసంగిస్తారు. 2014లో మోదీ ఐక్యరాజ్య సమితిలో తొలి ప్రసంగం చేశారు. మోడీ రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ప్రపంచ దేశాల సదస్సులో తొలిసారి ప్రసంగించనున్నారు. మోడీ ప్రసంగం ముగిసిన వెంటనే పాకిస్థాన్  ప్రధానమంత్రి ఇమ్రాన్ ప్రసంగిస్తారు. 


నిజానికి కశ్మీర్ అంశంపై ప్రపంచ దేశాల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో పాక్ ప్రధానికి ఈ అంశంలో పెద్దగా చేయాల్సిందీ కనిపించని పరిస్థితి. మరోపక్క హౌడీ మోడీ కార్యక్రమంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో హడావుడి చేస్తుంటే, ఇమ్రాన్ వాదనను వినేవారే కరువయ్యారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశం అనంతరం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఈ అంశంలో తన అసంతృప్తిని మరొకసారి బయటపెట్టారు. కశ్మీర్‌లో  ఎలాంటి పరిస్థితులున్నాయో చెబుతూ.. ఆ స్థితిలో ఏ యూదులో, అమెరికన్ లో ఉంటే ఇలాగే వదిలేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. 


బలంగా ఉన్న భారత్ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ సమాజంలో భారత్‌ కు ఉన్న పలుకుబడి కారణంగా తమ వాదన చెల్లుబాటు కావటం లేదనే వాదనను పాకిస్థాన్ వినిపిస్తోంది. 120 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌ ను తమ ఉత్పత్తులకు పెద్ద మార్కెట్‌ గా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయని పాక్ ఆరోపిస్తోంది. ఈ పరిణామాల మధ్య భారత్, అమెరికా ప్రధానులు ఒకే వేదికపై కనిపించనున్నారు. దీంతో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ లో జరగే చర్చ ఆసక్తికరంగా మారింది. 









మరింత సమాచారం తెలుసుకోండి: