గ‌త కొద్దికాలంగా విమాన ప్ర‌యాణాలు పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌యాణికుల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లు ర‌కాలైన స్కీంలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. తాజాగా బడ్జెట్ ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కొత్తగా 46 దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించనున్న‌ట్లు తెలిపింది. వచ్చే నెల నుంచి విమానసర్వీసుల సేవలు మొద‌లు కానున్నాయి. 


స్పైస్‌జెట్ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం, అక్టోబర్ 27 నుంచి విడతల వారీగా సర్వీసులు ప్రారంభం కానున్నాయి. పూణే-జోధ్‌పూర్, చెన్నై-దుర్గాపూర్ (ఉడాన్ స్కీంలో) ముంబై-జోధ్‌పూర్, బెంగళూరు-గువాహటి, చెన్నై-విశాఖపట్నం, చెన్నై-జైపూర్, విజయవాడ-విశాఖపట్నం, హైదరాబాద్-ఔరంగాబాద్, చెన్నై-పాట్నా, అహ్మదాబాద్-జోధపూర్, సూరత్-ఉదయ్‌పూర్ మధ్య కొత్త సర్వీసులు నడువనున్నాయి. మొదట ముంబై-రాజ్‌కోట్ విమానాన్ని నడపనున్నట్లు సంస్థ అధికారులు వెల్లడించారు.


కాగా, ఉడాన్ సేవ‌ల్లో భాగంగా స్పైస్‌జెట్ ఈ సేవ‌ల‌ను అందుబాటులోకి తెస్తున్న‌ట్లు స‌మాచారం. ఉడాన్‌ పథకం కింద 235 మార్గాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 18 మార్గాల్లో సీప్లేన్‌లు సేవలు అందిస్తాయి. కొత్తగా మంజూరు చేసిన మార్గాల వల్ల ఇంత వరకూ విమానాలు రాకపోకలు లేని 16 విమానాశ్రయాలకు, వాటర్‌ ఎరోడ్రోమ్‌లకు కనెక్టివిటీ లభిస్తుంది వార్షిక ప్రాతిపదికన 235 మార్గాల్లో 69.30 లక్షల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మూడో విడతలో మార్గాలను సొంతం చేసుకున్న కంపెనీల్లో స్పైస్‌జెట్‌, ఇం డిగో, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఎయిరిండియా అనుబంధ సంస్థ అలయన్స్‌ ఎయిర్‌లు, టర్బో ఏవియేషన్‌లు తదితరాలు ఉన్నాయి.

చిన్న పట్టణాలకు తక్కువ ఖర్చుతో విమానయాన సేవలను అందించే ఉడాన్‌  పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. హిమాచల్  ప్రదేశ్  లో సిమ్లా- ఢిల్లీ మధ్య తొలి ప్రాంతీయ విమాన సేవలను జెండా ఊపి ప్రారంభించారు.  దీంతోపాటు నాందేడ్‌-  హైదరాబాద్‌   మధ్య కూడా ఉడాన్  సర్వీలను ప్రారంభించారు. 500 కిలో మీటర్లకు 2వేల 500 రుపాయల ఛార్జీలు వసూలు చేయనున్నారు.  ఉడాన్ స్కీమ్ కింద పశ్చిమ ప్రాంతంలో 24, ఉత్తర ప్రాంతంలో 17, ద‌క్షిణ ప్రాంతంలో 11, తూర్పు ప్రాంతంలో 12 విమానాశ్రయాల‌ను అనుసంధానం చేయ‌నున్నారు. ఈ ప‌థ‌కం ద్వారా సుమారు 45 విమానాశ్ర‌యాల‌ను క‌ల‌పాల‌న్నదే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్దేశం. కడప-హైదరాబాద్, నాందేడ్-హైదరాబాద్ మధ్య కూడా ఉడాన్ సేవలు ప్రారంభం అయ్యాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: