వాతావరణంలో వచ్చిన మార్పులతో సముద్రం వేడెక్కుతోంది. ఫలితంగా సంద్రాల్లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ ప్రభావం ఇప్పుడు అండమాన్ ఉనికికే ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. వాతావరణ మార్పులపై ఏర్పడిన ప్రభుత్వాల బృందం– ఐపీసీసీ వెల్లడించిన రిపోర్ట్ వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. మంచుకొండలు, సముద్రాలు, సముద్రపు పర్యావరణంపై అధ్యయనం చేసిన ఐపీసీసీ ఈ నివేదికను రూపొందించింది.  సముద్ర మట్టాలలో పెరుగుదల, తుఫాన్‌ల కారణంగా అండమాన్‌ నికోబార్‌ దీవులు భవిష్యత్తులో నివాస యోగ్యం కాకుండాపోయే ప్రమాదం ఉందని, అవి సముద్రంలో మునిగిపోవచ్చని ఈ అంతర్జాతీయ నివేదిక హెచ్చరించింది. 


వాతావరణ మార్పులపై ఏర్పడిన ప్రభుత్వాల బృందం(ఐపీసీసీ) నివేదిక సముద్రపు ఉష్ణోగ్రతలు పెరుగడం వల్ల తుఫాన్‌ల వంటి ప్రకృతి వైపరీత్యాలు తరచుగా సంభవిస్తాయని అందువల్ల అండమాన్‌, నికోబార్‌, మాల్దీవుల వంటి ప్రదేశాల నుంచి ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుందని తెలిపింది. సముద్ర ఉష్ణోగ్రతలు 1993తో పోలిస్తే నేడు రెట్టింపయ్యాయి. సముద్రపు వడగాలులు 1982 నాటికన్నా ఇప్పుడు రెట్టింపు ఉద్ధృతితో వీస్తున్నాయి. దీంతో మంచుకొండలు, మంచు పలకలు కరిగిపోతున్నాయి. ఫలితంగా సముద్ర మట్టాలు 20వ శతాబ్దంతో పోలిస్తే రెట్టింపు వేగంతో పెరుగుతున్నాయి. ఈ విషయాలను వాతావరణ మార్పులపై ఏర్పడిన ప్రభుత్వాల బృందం(ఐపీసీసీ) నివేదిక వెల్లడించింది. మంచుకొండలు, సముద్రాలు, సముద్రపు పర్యావరణంపై అధ్యయనం చేసిన ఐపీసీసీ ఈ నివేదికను రూపొందించింది. మంచుకొండలు కరిగిపోవడం వల్ల 2050 నాటికి నదుల ప్రవాహం పెరుగుతుందని, కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక హిమపాతం, వరదలు సంభవించడం వంటి విపత్తులు వస్తాయని ఆ నివేదిక హెచ్చరించింది.


సముద్రపు వడగాలులతోపాటు ఎల్‌నినో, లానినా తరచుగా సంభవిస్తాయని తెలిపింది. సముద్రపు మట్టాలు పెరుగడం గతంలో శతాబ్దానికొకసారి జరిగేదని, కానీ ఇకపై ఏడాదికొకసారి ప్రత్యేకంగా ఉష్ణమండల ప్రాంతాల్లో తరచుగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటివరకు సముద్రాలు 20 నుంచి 30 శాతం మానవ ప్రేరిత కర్బన ఉద్గారాలను, వాతావరణంలోని 90 శాతం అదనపు ఉష్ణాన్ని పీల్చేసుకున్నాయని దీంతో అవి ఆమ్లీకరణ చెందాయని ఐపీసీసీ నివేదిక తెలిపింది. సముద్రపు ఉష్ణం, ఆమ్లీకరణ కారణంగా చేపల ఉత్పత్తి భారీగా పడిపోయిందని పేర్కొంది. భవిష్యత్తులో ఉష్ణమండల ప్రాంతాల్లో చేపల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవచ్చని హెచ్చరించింది. అయితే అదే సమయంలో ఆర్కిటిక్‌ వంటి ప్రాంతాల్లో చేపల సంతతి బాగా వృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపింది. ఆర్కిటిక్‌ సముద్రంలో ప్రతి నెల మంచు తరిగిపోతున్నదని ఆ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: