తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీ ఎన్నిక తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా దెబ్బ తిన్న టీఆర్ఎస్.. ఈ ఎన్నిక గెలిచి సత్తా చాటాలని భావిస్తుంటే.. ఎలాగైనా ఇక్కడ గెలిచి.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విసిరిన సవాల్ ఆసక్తి రేపుతోంది.


హుజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితాన్ని కేసీఆర్ 9 నెలల పాలనకు రిఫరెండంగా భావిస్తారా అని ఉత్తమ్ ప్రశ్నిస్తున్నారు.. అయితే సాధారణంగా సై అంటే సై అనే.. కేటీఆర్ ఈ విషయంలో మాత్రం ఆచితూ చి స్పందించారు. ప్రతిపక్షాలు విసిరే అర్థంలేని సవాళ్లకు స్పందించాల్సిన అవసరం లేదని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్‌ ఇష్టాగోష్టిగా మాట్లాడారు.


హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక 9 నెలల పాలనకు సూచికగా తీసుకుంటారా?అని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరించేది లేదని కేటీఆర్‌ తేల్చిచెప్పారు. ఉత్తమ్‌ గతంలోనూ అనేక సవాళ్లు విసిరి తోక ముడిచారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో తెరాస గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే అక్కడ సాంకేతికతంగా గెలిచామని.. ట్రక్కుగుర్తు ప్రభావంతో నాడు ఉత్తమ్‌ గెలిచారన్నారు.


హుజూర్‌నగర్‌లో ‘కాంగ్రెస్‌ గెలిస్తే ఉత్తమ్‌కు.. తెరాస గెలిస్తే ప్రజలకు లాభం’ అనే నినాదంతో ముందుకెళ్తున్నామని కేటీఆర్‌ వివరించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికకు 30 మంది పార్టీ నేతలను వివిధ ప్రాంతాలకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించినట్లు కేటీఆర్‌ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారని చెప్పారు. తాజాగా నిర్వహించిన సర్వేలో తెరాసకు 50 శాతం, కాంగ్రెస్‌కు 40 శాతం మంది ప్రజల మద్దతు ఉన్నట్లు తేలిందన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆ తర్వాత నల్గొండ ఎంపీగానూ గెలవడంతో ఉప ఎన్నిక వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: