ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్ పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పట్టణ మౌలిక వసతులు, స్మార్ట్‌ సిటీ, పట్టణాభివృద్ధి, ఆటోమొబైల్, సౌర, ఇంధన పునరుత్పాదకత వంటి రంగాలు వారిని ఆకర్షిస్తున్నాయి. అందుకే ఇక్కడి అవకాశాలు తెలుసుకునేందుకు ఫ్రెంచ్ పారిశ్రామిక వేత్తల బృందం ఏపీకి వచ్చింది.


గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఇలాంటి బృందాలు వస్తే.. దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే వారు.. ఇదిగో పెట్టుబడులు వస్తున్నాయ్.. అదిగో ఆ కంపెనీ వస్తోంది అంటూ ఎల్లో మీడియా కూడా ఉదరగొట్టేది. కానీ ఇప్పుడూ ఈ ఫ్రెంచ్ బృందం పర్యటన పెద్దగా ప్రచార హడావిడి లేకుండానే సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో దీర్ఘకాల భాగస్వామ్య ఒప్పందానికి పారిశ్రామిక వేత్తల బృందం ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.


ఈ పర్యటన ద్వారా ఏపీ రైతులకు మేలు చేయాలని జగన్ భావిస్తున్నారు. రైతుల ఆదాయం పెరిగేలా పాడి, మాంసం, పండ్లు ఫలాలు, కూరగాయల వంటి రంగాలపైనా దృష్టి పెట్టి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలకు జగన్ సూచించారు. అందుకు ఫ్రెంచ్ ప్రతినిధులు కూడా సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మెడెఫ్‌ చైర్మన్‌ జాఫ్రీ రౌక్స్‌ డీ బెజియెక్స్‌ నేతృత్వంలో వచ్చిన ఈ బృందం.. ఏపీలో రెండు రోజుల పర్యటించింది.


ఆ తర్వాత ఈ ఫ్రాన్స్‌ పారిశ్రామిక వేత్తల బృందం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్న అంశాలను సీఎం వారికి వివరించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం లో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని సీఎం జగన్ వారికి సూచించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మురుగునీటి పారిశుద్ధ్యం, చెత్త రీసైకిల్‌ వంటి వాటిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఏపీ పౌరులకు మరింత మెరుగైన సేవలందించే స్మార్ట్‌ ఎనర్జీ విధానం, స్మార్ట్‌ సిటీ పరిపాలన ప్రభుత్వ ప్రాధాన్యాల్లో కీలకమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ అంశాలపై తమ ప్రతిపాదనలను ఏపీ ముందు ఉంచాలని జగన్ కోరినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: