హైదరాబాద్‌ను వ‌ర్షం ముంచెత్తుతోంది. రహదారులన్నీ ఏరులైపారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మళ్లీ కుండపోత వాన కురిసింది.రాగల 24గంటల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాగా, హైదరాబాద్​లో ఇప్పట్లాగే గత 111 ఏళ్లలో 6 సార్లు మాత్రమే భారీ వ‌ర్షం  వచ్చింది. 


రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రేటర్ హైదరాబాద్‌లో రోడ్లపై వరద పోటెత్తింది. భారీ వ‌ర్షంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మాసబ్‌ట్యాంకు, సైదాబాద్, హబ్సిగూడ, ఉప్పల్, కాప్రా, మియాపూర్, లింగంపల్లి, చందానగర్, సనత్‌నగర్, మెహిదీపట్నం, కూకట్‌పల్లి, రాయదుర్గం, శేరిలింగంపల్లి, జీడిమెట్ల, షాపూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.నాలాలు పొంగిపొర్లటంతో కాలనీలు, రోడ్లు చెరువులుగా మారాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. దీంతో ఇళ్లలోకి భారీగా నీళ్లు చేరటంతో జనం అవస్థలు పడ్డారు. వర్షానికి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. 


కాగా, మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ మహారాష్ట్ర, దాన్ని ఆనుకుని ఉన్న గోవా, కర్ణాటక, తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు చాన్స్ ఉందని తెలిపారు. శుక్ర, శనివారాల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో న‌గ‌ర వాసులు అల‌ర్ట్‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: