పేరుకు మహా నగరం. వర్షం వస్తే రోడ్లన్నీ జలపాతం. సాయంత్రం వేళ కురిస్తే ఇంటికి చేరుకునే వాహనదారులకు చుక్కలు కనిపిస్తాయి. ఇక ఆ రాత్రంతా ట్రాఫిక్‌ పోలీసులకు, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి కాళరాత్రే. నిజాం ప్రభువుల కాలంనాటి డ్రైనేజీ వ్యవస్థ తీరు మారదు. నాలాలు కుచించుకుపోతున్నా పట్టించుకునే నాధుడు లేడు.  ఈ మ‌ధ్య హైద‌రాబాద్‌లో  కురిసే కుంభవృష్టికి నాగోల్‌ నాలాలో పడి ఒకరు కొట్టుకుపోగా..ఇంకొకరిని స్థానికులు కాపాడారు. మొన్నటికి మొన్న వర్షం వస్తోందని మౌనిక అనే అమాయకురాలు మెట్రో పిల్లర్‌ కింద నించుంటే ఆ పిల్లరే కిల్లరై ఆమెను కాటేసింది. గతంలోనూ హైదరాబాద్‌ నాలాలలో పడి ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. నగరం ఎటు చూసినా సురక్షితంగా లేదంటూ ఫిర్యాదులందుతున్నాయి.


కాంట్రాక్టర్లు కూడా వేసవికాలం అంతా ఉట్టిగా గడిపి వర్షాలు మొదలవుతుండగా రోడ్ల నిర్మాణాలు చేపడుతుంటారు. దీనితో కొన్ని కాలనీలలో తెరిచివుంచిన మ్యాన్‌హోల్స్‌లో పడి అనేకులు ప్రాణాలు వదిలిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఎప్పటికప్పుడు పూడికతీత పనులు చేపడుతూనే ఉంటామంటారు. కానీ భారీ వర్షాలు వచ్చినప్పుడు మాత్రం నామమాత్రంగా చేతులు దులిపేసుకుంటున్నారు.


ఎడ‌తెరుపు లేని వ‌ర్షాల‌కు వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారు. వరద నీటిలో పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై వృక్షాలు నేలకొరిగాయి. దాదాపు నగరమంతా నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలలో రోడ్లపై మూడడుగుల వరకు నీరు ప్రవహించడంతో ద్విచక్రవాహనదారులు నరకయాతన అనుభవించారు. అనేక చోట్ల కార్లు దాదాపు నీట మునిగాయి. రోడ్లు కనపడనంతగా నీళ్ళు చేరుకోవడంతో నగరంలో అనేకప్రాంతాలలో బారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. కిలో మీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌ లో పలు ప్రాంతాలలో సుమారు 6-8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అవడం విశేషం. ఈ భారీ వర్షానికి ఈదురుగాలులు కూడా తోడవడంతో నగరంలో అనేక చోట్ల చెట్లు రోడ్డుకి అడ్డంగా కూలిపోవడంతో వాటి కారణంగా కూడా ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. నగరంలో అంబర్‌ పేట్‌, నల్లకుంట, హిమాయత్‌ నగర్‌, విద్యానగర్‌, నాంపల్లి, చిక్కడపల్లి, గాంధీనగర్‌, ముషీరాబాద్‌, రాంనగర్‌, చార్మినార్‌, గోషామహల్‌ మొదలైన ప్రాంతాలలో రోడ్లపైకి బారీగా నీళ్ళు చేరాయి. నాలాలు పొంగి ప్రవహిస్తుండటంతో అడుగు ముందుకు వేస్తే ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే అవుతోంది. మెహిదీపట్నం, మలక్‌ పేట్‌, సంతోష్‌ నగర్‌, ఉప్పల్‌, రామాంతపూర్‌, సనత్‌ నగర్‌ తదితర ప్రాంతాలలో కొన్ని ఇళ్ళలోకి నీళ్ళు ప్రవేశించడంతో అందులో నివసిస్తున్నవారు చాలా ఆందోళనచెందారు. భారీ వర్షం కురియడంతో అనేక చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మరికొన్ని చోట్ల విద్యుత్‌ శాఖవారే ముందు జాగ్రత్తచర్యగా విద్యుత్‌ నిలిపివేయడంతో ఎప్పుడూ విద్యుత్‌ కాంతులతో ధగధగ మెరిసే హైదరాబాద్‌ నగరంలో చీకట్లు కమ్ముకొన్నాయి. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్ళకు బయలుదేరినవారు రాత్రి 8.30 గంటలైనా ఇంకా వర్షంలో, ట్రాఫిక్‌ లో చిక్కుకొనిపోయున్నారు. ఇంకా ఎప్పటికి ట్రాఫిక్‌ క్లియర్‌ అవుతుందో తెలియక రోడ్లపై చాలా ఇబ్బందిపడ్డారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్ధులు చాలా ఇబ్బంది పడ్డారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: