హైదరాబాద్ నగరంలో క్యాబ్ సేవలు ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికే ఓలా, ఉబర్ సంస్థలు క్యాబ్ సేవలను అందిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఈ నెల 29వ తేదీ నుండి ప్రైడో క్యాబ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా రద్దీ సమయాల్లో సేవలను అందిస్తామని వెంకట ప్రణీత్ టెక్నాలజీస్ కంపెనీ యాజమాన్యం చెబుతోంది. 
 
గురువారం హైదరాబాద్ నగరంలో జరిగిన సమావేశంలో ప్రైడో వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కామరాజు 14,000 క్యాబ్ డ్రైవర్ల భాగస్వామ్యంతో క్యాబ్ సేవలను అందించబోతున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన హాక్ ఐ యాప్ తో ప్రైడో యాప్ మిళితం చేశామని, యాప్ ఉపయోగించి డ్రైవర్లకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని పరిశీలిస్తున్నామని పరిశీలన తరువాతే క్యాబ్ డ్రైవర్లుగా నియమించుకుంటామని  ఎండీ నరేంద్ర కామరాజు తెలిపారు. 
 
క్యాబ్ డ్రైవర్లు చెల్లించాల్సిన కమిషన్ 10 శాతం కంటే చాలా తక్కువగా ఉంటుందని అందువలన క్యాబ్ డ్రైవర్ల ఆదాయం కూడా మెరుగవుతుందని మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కామరాజు తెలిపారు. ప్రయాణికులు క్యాబ్ సేవలు అవసరం అయితే వారం, నెల రోజుల ముందే క్యాబ్ సేవలను బుకింగ్ చేసుకొనే సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ సంఖ్యలో క్యాబ్ లను బుకింగ్ చేసుకునే సదుపాయం కూడా కలిస్తున్నామని తెలిపారు. 
 
క్యాబ్ డ్రైవర్లు ఎప్పుడైనా దూర ప్రాంతాలకు ప్రయాణికులను డ్రాప్ చేయటానికి వెళితే ఖాళీగా తిరిగివచ్చే క్యాబ్ డ్రైవర్లకు ఎటువంటి నష్టం రాకుండా రిటర్న్ కాంపన్సేషన్ ఇస్తామని తెలిపారు. ప్రయాణికులకు క్యాబ్ దగ్గర్లో అందుబాటులో లేకపోయినప్పటికీ క్యాబ్ దూరం నుండి రప్పించుకొనే సదుపాయం కూడా  ఉందని  తెలిపారు. దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు కూడా ప్రైడో క్యాబ్ సేవలను విస్తరించబోతున్నట్లు ఎండీ నరేంద్ర కామరాజు తెలిపారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: