గ‌త జూన్‌లో హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ భ‌యంక‌ర‌మైన సంఘ‌ట‌న గుర్తుండే ఉంటుంది. భారీ వర్షానికి సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో వాహనాలు కిలోమీటర్‌ల దూరంలో బారులు తీరి..అర్ధరాత్రి దాటినా బయటపడని పరిస్థితి. అలాంటి పరిస్థితిని సుదీర్ఘ విశ్లేషణ, ఫీల్డ్ స్టడీ, సమన్వయంతో అధిగమించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఇప్పుడు సమర్థవంతగా నిర్వహించగలుగుతున్నారు.  అయితే.. ఇంకా వర్షపు నీరు నిలుస్తున్న కొన్ని ప్రాంతాల్లో ఇతర విభాగాలు సహకరిస్తే ...వర్షం పడినా ట్రాఫిక్ ఆగకుండా చేయవచ్చునని సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులు అంటున్నారు.


ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే...సైబరాబాద్ ఐటీ కారిడార్‌లోకి ఉదయం 8 నుంచి 11, సాయంత్రం 5 నుంచి 9 గంటల సమయంలో దాదాపు 5 లక్షల వాహనాలు వస్తాయి.. బయటికి వెళ్తాయి. ఒక్క సారి వర్షం పడితే... ఇవన్నీ రోడ్లపై ఆగాల్సిందే. అయితే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల విశ్లేషణ అనంతరం గ‌త ఏడాది జూన్ నెలలో నెలకొన్న గందరగోళం తర్వాత.. వివిధ విభాగాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నివేదికను అందించారు. దీనిపై అందరూ సమన్వయంతో ముందుకు సాగడంతో మూడు నెలల్లో పరిస్థితి చక్కదిద్దుకుంది.


అన్ని వ‌ర్గాల స‌మ‌న్వ‌యంలో భాగంగా, ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలకు అడ్డంకిగా మారిన అన్ని మార్గాలను క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఇరుకు దారులు, రోడ్డు మలుపులు, నీళ్ల నిలిచే ప్రాంతాలన్నింటితో ఓ మ్యాప్ తయారు చేసుకొని పరిష్కార మార్గాలు అన్వేషించారు. ఐటీ కంపెనీలతో చర్చించారు. ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు తయారు చేసి ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు సమాచారం చేరవేశారు. వర్షం పడినప్పుడు ట్రాఫిక్ రద్దీ సమాచారం అందించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం బాగా కలిసి వచ్చింది. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ స్వయంగా ఐదు గ్రూపుల్లో ఉండి... మొదటగా ట్రాఫిక్ అలర్ట్‌ను పంపిస్తారు. ఈ అలర్ట్‌ను అందుకున్న గ్రూపు సభ్యులు... వారి వారి కంపెనీల్లో ఉన్న లక్షలాది ఉద్యోగులకు దాదాపు 100కు పైగా వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం పంపిస్తారు. దీంతో వారు వాటిని చదువుకుని సమయానుకూలంగా బయలుదేరుతారు. దీంతో కూడా రోడ్లపై వర్షం పడుతుంది .. తొందరగా ఇంటికి చేరాలని ఆతృతతో బయలుదేరక‌పోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య త‌ప్పిపోయింది.


దీంతో మంగళ, బుధ వారాల్లో..రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. ఐటీ కారిడార్‌లోని మైండ్‌స్పేస్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, ఐటీ రహేజా, శిల్పారామం ప్రాంతాల్లో యథావిధిగానే వాహనాలు నెమ్మదించాయి. కానీ .. ఆగకుండా వెంటవెంటనే ముందుకు సాగాయి. గంటలకొద్దీ ఆగిపోయే వాహనాలు నిమిషాల వ్యవధిలోనే గమ్యస్థానాలు చేరుకున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: