ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో డెంగీ జ్వరం విజృంభిస్తోంది. ఎందరో డెంగీ బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వీరికి ప్రాణవాయువు లాంటి ప్లేట్ లెట్స్ కు ప్రభుత్వ, ప్రేవైటు ఆసుపత్రులు, రక్తనిధి కేంద్రాల్లో కొరత ఏర్పడింది. సాధారణ పరిస్థితుల కంటే రెట్టింపు స్థాయిలో ప్లేట్ లెట్స్ కు డిమాండ్ ఏర్పడింది. ప్లేట్ లెట్స్ ఇచ్చే దాతలు దొరక్క, సకాలంలో ప్లేట్ లెట్స్ అందక డెంగీ షాక్ తో ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నారు. ప్లేట్ లెట్స్, రక్తదానం విషయంలో అవగాహన లేక కొందరు వెనకడుగు వేస్తున్నారు. మరికొందరు స్వచ్ఛందంగా ఇస్తున్నారు.

 


సింగిల్ డోనర్ ప్లేట్ లెట్స్ వారానికి రెండు సార్లు ఇవ్వొచ్చని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ఎటువంటి అనారోగ్యం ఉండదంటున్నారు. రక్తదానం.. పురుషులు మూడు నెలలకోసారి, మహిళలు నాలుగు నెలలకోసారి చేయవచ్చు. ఎస్ డీపీలు నుంచి ప్లేట్ లెట్స్ సేకరణకు రెండున్నర గంటల సమయం పడుతుంది.   వీరివల్లే రోగులను ప్రాణాపాయ స్థితి నుంచి గట్టెక్కించేందుకు వీలవుతుంది. ఎస్ డీపీల నుంచి ప్లేట్ లెట్స్ ను ఒకే బ్లడ్ గ్రూపుకు చెందిన రోగి-దాత మధ్య నేరుగా మారుస్తారు. దాత నుంచి కేవలం ప్లేట్ లెట్స్ ను మాత్రమే తీసుకుంటారు. దాత నుంచి సేకరించిన రక్తం ఓ మిషన్ లోకి వెళ్లి అక్కడ ప్లేట్ లెట్స్ వేరవుతాయి. మళ్లీ దాత శరీరంలోకి రక్తం వెళ్లిపోతుంది. ఇందులో ప్లాస్మా, రక్తకణాలు అలానే ఉంటాయి. ఆర్ డీపీలో రోగి, దాతలది వేరే బ్లడ్ గ్రూపులు. ఇక్కడ రక్తం తీసుకుని ప్లేట్ లెట్స్ ను వేరు చేస్తారు.

 


రక్తంలో ప్లాస్మా, తెల్ల, ఎర్ర రక్తకణాలు ఉంటాయి. ప్లేట్ లెట్లు రక్తస్రావానికి అడ్డుకట్ట వేస్తాయి. ప్లాస్మా వల్ల రక్తం గడ్డకడుతుంది. వ్యాధి కారక క్రిములపై రక్త కణాలు పోరాటం చేసి రోగాలు రాకుండా చేస్తాయి. రక్తంలోని ఒక క్యూబిక్ ఎంఎంలో 1.5-4 లక్షల వరకు ప్లేట్ లెట్స్ ఉంటాయి. డెంగీ జ్వరంతో వీటి సంఖ్య పదివేల కంటే తగ్గిపోతే రక్తస్రావమై రోగి షాక్ లోకి వెళ్లిపోతాడు. కాలేయంతో సహా ఇతర అవయువాలు పనిచేయక రోగి మృత్యువాత పడతాడు.

 

 

దానం చేయకూడని వారు..

ఎయిడ్స్, టీబీ, హైపటైటిస్, క్యాన్సర్, మతి స్థిమితం లేనివారు, మానసిక సమస్యలతో బాధపడేవారు, టాటూ వేయించుకున్నవారు, అధిక రక్తపోటు, మధుమేహం.. ఉన్నవారు రక్తదానం – ప్లేట్ లెట్స్ దానం చేసేందుకు అర్హులు కారు. డెంటల్ శస్త్ర చికిత్సలు చేయించుకున్నవారు సంవత్సరం వరకూ ఇవ్వకూడదు. పొగతాగిన 2 గంటలు, ఆల్కహాల్ తాగిన 24 గంటల వరకూ వీరు రక్తదానం, ప్లేట్ లెట్స్  ఇవ్వకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఇవీ ఉపయోగాలు..

రక్తదానం, ప్లేట్ లెట్స్ ఇవ్వడం వల్ల రక్తంలో కొవ్వు శాతం అదుపులో ఉంటుంది. గుండె జబ్బులకు అవకాశం తక్కువ. ప్లేట్ లెట్స్ ఇచ్చేటప్పుడు సింగిల్ డోనర్ లో 63 ఎంఎల్ రక్తం మాత్రమే పంపింగ్ అవుతూంటుంది.. దీనివల్ల ఎటువంటి నీరసం ఉండదు. రక్తదానంతో రక్తం, ప్లేట్ లెట్స్, కణాలుగా వేరు చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడొచ్చు. రక్తదానం ఎక్కువగా చేసేవారిలో క్యాన్సర్ ముప్పు తక్కువ. ఏడాదికి ఒక్కసారైనా రక్తదానం చేయటం వల్ల 88 శాతం గుండెపోటు నుంచి ముప్పు తప్పుతుంది. రక్తంలో ఎక్కువగా ఉండే ఇనుము శాతం కూడా తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: