హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉదయం, సాయంత్రం సమయాల్లో విపరీతంగా ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. ఎక్కడ చూసినా వాహనాలు బారులు తీరి ఈ సమయాల్లో కనిపిస్తూ ఉంటాయి. స్మార్ట్ ఫోన్లు ఉన్నవారు ట్రాఫిక్ ఎలా ఉందో సులభంగానే తెలుసుకోగలరు. కానీ స్మార్ట్ ఫోన్లు లేని వారికి మాత్రం ట్రాఫిక్ రద్దీ తెలుసుకోవటం అంత తేలిక కాదు. ట్రాఫిక్ రద్దీ ఎలా ఉందో తెలిస్తే దానికి అనుగుణంగా కొంతమంది ప్రయాణంలో మార్పులు చేసుకొనే అవకాశం ఉంది. 
 
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రద్దీని తగ్గించటం కొరకు, మరియు ప్రధాన రహదారులపై ప్రయాణించేవారికి ట్రాఫిక్ ఎలా ఉందో తెలియజేయటంపై దృష్టి సారించారని తెలుస్తోంది. ఉదయం సమయంలో ప్రధాన రహదారులలో ట్రాఫిక్ ఎలా ఉందనే విషయాన్ని మెసేజ్ ద్వారా సెల్ ఫోన్లకు అందించాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ట్రాఫిక్ పోలీసుల దగ్గర నంబర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
ఇందుకోసం ఒక నంబర్ ను త్వరలోనే ట్రాఫిక్ పోలీసులు ప్రవేశపెట్టబోతున్నారని కూడా సమాచారం అందుతుంది. పోలీసులు జంట నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో కష్టానికి తగిన ఫలితం కనిపించటం లేదు. మెహిదీపట్నం, టోలిచౌకి, అమీర్ పేట్, లక్డీకపూల్, అబిడ్స్, బేగంపేట్ ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకు పెరిగిపోతుంది. 
 
ప్రయాణికులకు ట్రాఫిక్ గురించి మెసేజ్ పంపించటం ద్వారా ట్రాఫిక్ తగ్గించాలని పోలీసులు ఆశిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో వర్షాలు పడుతూ ఉండటంతో జీహెచ్ఎంసీ సేఫ్టీ విభాగం అధికారులు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో కలిసి నగర కమిషనర్ అంజనీ కుమార్ పర్యవేక్షించారు. అంజనీ కుమార్ సిగ్నల్స్, ప్రధాన జంక్షన్లు, యూ టర్న్ లు ఉన్న ప్రాంతాలలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు వివరించారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించటానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని అంజనీకుమార్ ఆదేశాలు ఇచ్చారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: