హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక రాష్ట్ర‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ప్ర‌ధాన పార్టీల‌న్నింటికీ ఈ ఉప ఎన్నిక అగ్ని ప‌రీక్ష‌గా మారింది. అధికార టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ తోపాటు బీజేపీ ఈ ఎన్నిక‌ను అత్యంత ప్ర తిష్టాత్మ‌కంగా భావిస్తున్నాయి. ఇక కేసీఆర్ ఈ ఎన్నిక‌ను చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని మొత్తం 70 మంది పార్టీ నేత‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు ఇక్క‌డ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సీటు కావ‌డంతో తాము ఇక్క‌డ గెల‌వాల‌ని కాంగ్ర‌స్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.


అదే టైంలో పీసీసీ అధ్యక్షుడి కంచుకోట హుజూర్‌న‌గ‌ర్‌లో గులాబీ జెండా ఎగ‌ర‌వేయ‌డం ద్వారా ప్రజామోదం తమ‌కే ఉంద‌ని చె ప్పుకోవ‌డంతోపాటు, త‌మ పాల‌న‌పై విప‌క్షాల ఆరోప‌ణ‌ల‌న్నింటికీ చెక్ పెట్టాల‌న్న‌ది కేసీఆర్ ప్లాన్‌. ఈ క్రమంలోనే గులాబీ బాస్ అంద‌రికంటే ముందుగానే త‌మ అభ్య‌ర్థిగా గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన శానంపూడి సైదిరెడ్డిని ప్ర‌క‌టించారు. ఇక కాంగ్రెస్ అభ్య‌ర్థినిగా ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి భార్య‌, కోదాడ మాజీ ఎమ్మెల్యే ప‌ద్మావ‌తిని ప్ర‌క‌టించారు.


ఇక బీజేపీ నుంచి ప‌లువురు పేర్లు ప‌రిశీలించి చివ‌ర‌కు కోట రామారావు పేరును ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తోంది. వాస్త‌వంగా ఇక్క‌డ శ్రీక‌ళా రెడ్డి సీటు ఆశించి విఫ‌ల‌మ‌య్యారు. ప్ర‌స్తుతం ఉప ఎన్నిక హీట్ స్టార్ట్ అవ్వ‌డంతో టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు గెలుపుకోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. బీజేపీ మాత్రం పోరులో  వెన‌క‌బ‌డింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ముందుగా బీజేపీ తెలంగాణ మ‌లిఉద్య‌మ తొలి అమ‌ర‌వీరుడు శ్రీకాంతాచారి త‌ల్లిని పార్టీలోకి తీసుకుని సీటు ఇవ్వాల‌ని అనుకున్నా.. ఆమె మాత్రం టీఆర్ఎస్‌లోనే కొన‌సాగుతాన‌ని చెప్ప‌డంతో బీజేపీ ప్లాన్ ఫెయిల్ అయ్యింది.


ఇక బీజేపీ ప్ర‌ధాన పార్టీల‌కు ఏ మాత్రం పోటీ ఇచ్చే అభ్య‌ర్థిని సైతం నిల‌బెట్ట‌లేక‌పోయింది. ఈ ప‌రిస్థితిని చూస్తే, ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధించ‌డం అటుంచి, క‌నీసం గ‌తంలో మాదిరిగా నోటాకు వ‌చ్చిన ఓట్ల‌యినా ఆ పార్టీ సాధిస్తుందో లేదో అని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: