వైద్యో నారాయణో హరీ అంటారు ... అయితే ఆ డాక్టర్లు మాత్రం డిఫరెంట్‌ .. విధి నిర్వహణలో నిర్లక్ష్యంతో పాటు .. ఆధిపత్యపోరుతో రచ్చకెక్కుతుంటారు. వైద్య సహయం చేయడం మానేసి.. చట్టవిరుద్దమైన పనులు చేస్తూ పాపం మూట కట్టుకుంటున్నారు. ఫలితంగా అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి. ఆ క్రమంలో హైద్రాబాద్‌ నిలోఫర్‌ ఆసుపత్రిలో వైద్యుల మధ్య నెలకొన్న వివాదాలు ఇప్పుడు పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లాయి. 


చిన్నారుల ఆరోగ్యాలను కాపాడాల్సిన వైద్యుల స్వార్థం ఆ ఆస్పత్రికి శాపంగా మారింది. ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే నిలోఫర్‌ హస్పటల్‌ ప్రతిష్ట మరోసారి రచ్చకెక్కింది.  గత కొంత కాలంగా నిలోఫర్‌ ఆసుపత్రులలో వైద్యుల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకుంటూ ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు.  రోజూ ఆసుపత్రికి వచ్చే రోగులతో కిటకిటలాడే నిలోఫర్‌ ఆసుపత్రిలో.. ప్రస్తుతం డాక్టర్లు వైద్య సేవలు పక్కనపెట్టి .. వ్యక్తిగత అంశాలపై చర్చించుకోవడానికే అధిక సమయాన్ని కేటాయిస్తున్నారు.
ఫలానా డాక్టర్‌ ఇలా చేశాడు...  ఆ డాక్టర్‌ ఇక్కడ ఇంత పెద్ద ఇల్లు కట్టాడు..  ఇంకో డాక్టర్‌ అర్హత లేకుండా పెద్ద పోస్టు సంపాదించింది. నా కంటే జూనియర్‌ రాజకీయ నాయకుల పైరవీలతో మంచి పోస్టు దక్కించుకున్నాడు. ఆ డాక్టర్‌ మందుల కంపెనీల నుంచి టూర్‌ ఆఫర్లు తీసుకుని ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఇలాంటి పనికి మాలిన కబుర్లతోనే ఎక్కువ మంది టైం పాస్‌ చేస్తున్నారు


నిలోఫర్‌ ఆసుపత్రిలో డాక్టర్లు సీనియర్లు, జూనియర్లు.... ప్రభుత్వ అనుకూలూరు, ప్రభుత్వ వ్యతిరేకులుగా గ్రూపులు కట్టారు ... దీంతో ఒకరు చేస్తున్న పనులపై మరొకరు వంకలు పెట్టడం అదికాస్త రచ్చకెక్కడం సర్వసాధారణం అవుతోంది. గతంలో స్నేహపూర్వక వాతావరణంలో విధులు నిర్వర్తించిన వైద్యులు...ఇప్పుడు బద్ద శత్రువులుగా తయారై ఒకరినొకరు అభాసుపాలు చేసుకుంటున్నారు... ఇటీవల ఒక కార్యక్రమం సందర్భంగా ఒక డాక్టర్‌ మరో డాక్టర్‌ పై కుర్చీ ఎత్తి కొట్టబోయాడని నాంపల్లి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు అందింది. ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు ఆసుపత్రిలో వసతులు లేవని పరిశీలన చేయడానికి వచ్చిన సందర్భంలో నా సెక్షన్‌లోకి నువ్వేలా వస్తావని అందరి ముందే ఇద్దరు వైద్యులు వాదులాడుకున్నారు.


గతంలో నిలోఫర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పని చేసిన రమేష్‌ రెడ్డికి ప్రస్తుతం ఆసుపత్రిలో పని చేస్తున్న కొందరు డాక్టర్లు అనుకూలంగా వ్యహరిస్తూ తమకు గిట్టని వారిపై ఫిర్యాదులు చేస్తున్నారని వైద్యవర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇలా ఫిర్యాదు అందిన వెంటనే సదరు డిఎంహెచ్‌వో కూడా చర్యలు ఉపక్రమించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నిజనిజాలు తెలుసుకోకుండా డాక్టర్లకు మెమోలు ఇవ్వడం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం వివాదాస్పదం అయ్యింది. ఈనేపథ్యంలో నిలోఫర్‌ ఆసుపత్రిలో తనకు వ్యతిరేకంగా ఉన్న వైద్యులపై డిఎంహెచ్‌వో, మరో వైద్యుడు కలిసి ఇతర డాక్టర్లపై ఆరోపణ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో సూపరింటెండెంట్‌గా వ్యవహరించిన రమేష్‌ రెడ్డి ఆ తరువాత డిఎంహెచ్‌వోగా పదోన్నతి పొందారు. ఆ సమయంలో ఆసుపత్రిలో క్లినికల్‌ ట్రయల్స్‌కు రమేష్‌ రెడ్డి స్వయంగా సంతకం చేసి అనుమతులు ఇచ్చారు. ఇప్పడు ఆ విషయాన్ని రచ్చ చేస్తూ ఒక వైద్యుడు ఫిర్యాదు చేయడం దానిపై డిఎంహెచ్‌వో రమేష్‌రెడ్డి విచారణ జరిపించడంపై వైద్య వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది.


కలిసికట్టుగా ఉంటూ ఆసుపత్రికి మంచిపేరు తీసుకురావల్సిన వైద్యులు ఇలా రచ్చకెక్కడం పై విమర్శలు వస్తున్నాయి. ఆసుపత్రుల్లో జరుగుతున్న విషయాలను కొన్నింటిని కావాలనే బయటపెడుతూ వివాదాలకు కారణం అవుతున్న డాక్టర్లు ఇప్పటికైన తమ వ్యవహార శైలి మార్చుకుని వైద్యరంగంపై ప్రజలకు నమ్మకం కలిగేలా పనితీరు ఉండాలని ప్రజలు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: