తెలంగాణ‌లో ఏకైక ఉప ఎన్నిక‌ అయిన హుజూర్‌న‌గ‌ర్‌...అన్ని పార్టీల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసందే. దీనిపై ప్రభుత్వ విప్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తాజాగా ఆస‌క్తిక‌ర వాద‌న చేశారు. తమ పార్టీ నాయకులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేస్తుంటే.. ఎన్నికలు కాకముందే ఓటమిని అంగీకరించినట్లు అనిపిస్తోందన్నారు. హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని పేర్కొన్నారు. కోదాడలో చెల్లని పైసా హుజుర్‌నగర్ ఎలా చెల్లుతుంది? అని ప్రశ్నించారు.


టీఆర్‌ఎస్‌ఎల్పీలో కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ....`కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు. నిజాయితీని నమ్ముకున్నప్పుడే గెలుపు సాధ్యమవుతుంది. వెన్ను చూపి పారిపోయిన నాయకులను ప్రజలు నమ్మరు. వారిని ఉత్తర కుమారులు అంటారు. మాట మీద నిలబడరు. కానీ యుద్ధంలో నిలబడిన వారిని మాత్రమే ధీరుడు, వీరుడు అని అంటారు. రాజకీయాల్లో సిన్సీయార్టి తప్ప సీనియార్టి ఉండకూడదు. రాజకీయాల్లో వయసుతో పని ఉండదు. నిబద్ధతతో పని చేసే వ్యక్తివి అయితే మాట మీద నిలబడాలి. 2018 ఎన్నికల్లో గద్వాలలో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. దానికి ఉత్తమ్ కూడా సిద్ధమా? అని కేటీఆర్ సవాల్ విసిరారు. ధీరుడు అని అనుకుంటే, మాట మీద నిలబడే ధైర్యముందనుకుంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు కేటీఆర్. తాను కూడా సవాల్‌ను స్వీకరిస్తున్నానని ఉత్తమ్ అన్నాడు. కానీ మాట మీద నిలబడలేదు. అధికారంలోకి రాకపోతే సన్యాసం తీసుకుంటానన్న ఉత్తమ్ మాట తప్పాడు`` అని కర్నె ప్రభాకర్ తెలిపారు.


ఈ పోటీపై క‌ర్నె ప్ర‌భాక‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కోదాడలో ఓడిపోయిన త‌న భార్య‌ను ఉత్త‌మ్ హుజుర్‌నగర్‌లో పోటీకి పెట్టడం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ ఎన్నికలు ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రభుత్వానికి, ప్రాజెక్టులు అడ్డుకుంటున్న పార్టీకి మధ్య జరుగుతున్నాయని కర్నె ప్రభాకర్ చెప్పారు. ప్ర‌జ‌లు ప‌నిచేసే పార్టీకే ప‌ట్టం క‌డ‌తార‌ని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: