ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా 2017-18 జాతీయ టూరిజం అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలోని ప్రజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పర్యాటకరంగానికి పెద్దగా ఆదరణ లేకపోయేది. కానీ ఇప్పుడు భారత్ పర్యాటకులను ఎర్రతివాచీ పరచి స్వాగతిస్తోందని కొనియాడారు. 

 


పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్న రాష్ట్రాలను గుర్తించి కేంద్రం అవార్డులు ప్రకటించింది. ఇందులో పర్యాటకం వృద్ధి, పర్యాటకుల సంఖ్య, సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా పర్యాటకంలో గణనీయమైన వృద్ధి సాధించినందుకు ఆంధ్రప్రదేశ్ ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైంది. ఉత్తమ రైల్వే స్టేషన్ విభాగంలో విశాఖపట్నం అవార్డు దక్కించుకుంది. ఉత్తమ కాఫీ టేబుల్ బుక్ కేటగిరీలోనూ ఆంధ్రప్రదేశ్ కు ప్రథమ స్థానం లభించింది. ఆంధ్రప్రదేశ్ తరపున ఈ అవార్డును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అందుకున్నారు. దీనిపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. టూరిజంలో సాంకేతికత వినియోగం, వినూత్నంగా నిర్వహిస్తున్నందుకు ఈ విభాగంలో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అడ్వెంచర్ టూరిజం కేటగిరీలో గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. సినిమా ప్రమోషన్లకు, షూటింగ్ లొకేషన్లను ఆకర్షించడంలో ఉత్తమ స్నేహపూర్వక రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఎంపికైంది.

 


ప్రపంచంలో ఒక దేశం గుర్తింపు తెచ్చుకోవాలంటే పర్యాటక అభివృద్ధి కూడా ఎంతో ముఖ్యం. దేశంలో పర్యాటకానికి అనుకూలమైన ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాద్యత ప్రభుత్వానిదే. వాటికి ప్రాచుర్యం కల్పించ పర్యాటకుల్ని ఆకట్టుకునేలా చేయాలి. ప్రస్తుతం దేశం పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా పర్యాటకంలో రాష్ట్రాలు చేస్తున్న కృషికి పలు అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. మన తెలుగు రాష్ట్రాలకు ఇందులో అవార్డులు రావడం గర్వాకారణం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: