కరకట్ట పేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిగారు పురపాలక, పట్టణాభివృధ్ధి శాఖలతో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు.  సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కరకట్ట మీద, కాల్వగట్ల మీద, కరకట్ట లోపల నివాసం ఉంటున్న వారికి ఇళ్లను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడ నివసించే వారికి 2020 ఉగాది పండుగలోపు వారు కోరుకున్న చోట ఇళ్లను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరకట్ట మీద ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను కూల్చివేయటం వలన అక్కడ నివసిస్తున్న ప్రజలు ఇళ్లు నష్టపోతున్నారు. అలాంటి పేద ప్రజలకు నష్టం జరగకుండా తగిన న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అక్రమ నిర్మాణాల కూల్చివేతలో నష్టపోయే ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులకు ఆదేశాలను ఇచ్చారు. 
 
ఏపీ ప్రభుత్వం సాధారణంగా ఇళ్ల నిర్మాణం కింద సెంటున్నర భూమిని ఇస్తుండగా కరకట్ట మీదున్న పేద ప్రజలకు 2 సెంట్ల విస్తీర్ణంలో ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. నదీ చట్టాలు, పర్యావరణ పరిరక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని అదే సమయంలో ఈ నిబంధనల కారణంగా సామాన్యులు, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. 
 
ఈ చట్టాల కారణంగా నష్టపోయే పేద ప్రజలకు ఉగాది నాటికి ఇళ్ల పట్టాలను ఇవ్వటంతో పాటు ఉచితంగా మంచి డిజైన్లలో ఇళ్లు కట్టి ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. చాలా సంవత్సరాల నుండి ఎవరైనా ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటే ఆలాంటి వారికికూడా ఇళ్ల పట్టాలను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ వరద నీరు ప్రవహించే ప్రాంతాల్లో నిర్మాణాలను చేపడితే పరిస్థితులు దుర్భరంగా మారతాయని చెప్పారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: