సాధారణంగా ఔషధ ప్రయోగాలు ప్రయోగశాలల్లో జరుగుతాయి. కానీ కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు, ప్రభుత్వ ఆస్పత్రులలో కూడా ఔషధ ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. నిలోఫర్, ఉస్మానియా, గాంధీ మొదలైన ఆస్పత్రులలో దాదాపు 50 వరకు సంవత్సరానికి ఔషధ ప్రయోగాలు జరుపుతున్నారని సమాచారం. సంవత్సర కాలంలో ఇలాంటి ప్రయోగాలు వందల సంఖ్యలో జరుగుతున్నాయి. 
 
కానీ ఈ ప్రయోగాలకు సంబంధించిన ఎటువంటి సమాచారం ప్రభుత్వం దగ్గర లేదు. ప్రభుత్వం వైపు నుండి కార్పొరేట్ ఆస్పత్రులలో జరుగుతున్న ఔషధ ప్రయోగాల విషయంలో పర్యవేక్షణ కూడా లేకపోవటం గమనార్హం. గతంలో ప్రభుత్వం ఔషధ ప్రయోగాల మార్గదర్శకాలను ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు పాటించటం కొరకు ఒక కమిటీని నియమించినప్పటికీ ఆ కమిటీ వలన పెద్దగా ఫలితం లేకుండా పోయింది. 
 
ఏదైనా ఔషధ ప్రయోగం చేయాలంటే ప్రయోగం చేయించుకొనే వారికి ఆ ప్రయోగం గురించి పూర్తిగా అవగాహన కల్పించాలి. ప్రయోగం చేయించుకునే వారు పిల్లలు ఐతే తల్లిదండ్రులకు ప్రయోగం గురించి వివరించాలి. ప్రయోగం వలన కలిగే దుష్ఫలితాల గురించి వివరించటంతో పాటు ప్రయోగాన్ని వీడియో ద్వారా చిత్రీకరించాలి. ప్రయోగంలో పాల్గొన్న వారికి బీమా సౌకర్యం కల్పించటంతో పాటు ప్రయోగానికి సంబంధించిన వివరాలు కేంద్ర ఔషధ నాణ్యత ప్రమాణాల నియంత్రణ సంస్థకు సమర్పించటంతో పాటు వారి దగ్గరినుండి అనుమతిని పొందాల్సి ఉంటుంది. 
 
కానీ ప్రయోగాలు చేస్తున్న వైద్యులు మాత్రం పేదలు, చదువుకోనివారిని ప్రయోగాల కొరకు ఒప్పిస్తున్నారు. ప్రయోగాల వలన ఏదైనా సమస్య వస్తే చెల్లించాల్సిన బీమా సొమ్మును కూడా వైద్యులు తక్కువ మొత్తంలొనే చెల్లిస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు చేస్తున్న ప్రభుత్వ ఆస్పత్రులలో ఉన్న సంబంధిత విభాగాధిపతులు భారీ మొత్తంలో డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రులలో ఇలాంటి ప్రయోగాలు చేసి ఆస్పత్రుల యాజమాన్యం మరియు సంబంధిత వైద్యులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని సమాచారం. 




మరింత సమాచారం తెలుసుకోండి: