ప్రకాశం జిల్లాలోని సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావును పొమ్మనకుండానే పొగ పెడుతున్నారా ? క్షేత్రస్దాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు మొదలయ్యాయి. సీనియర్ నేత, మాజీ మంత్రి దగ్గుబాటికి ఘనమైన నేపధ్యమే ఉంది. ఎన్టీయార్ అల్లునిగా,  కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి భర్తగా ఉన్నారు. ఎన్టీయార్ ఉన్నంత కాలం టిడిపిలో  బాగానే చక్రం కూడా తిప్పారు.

 

చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉన్న దగ్గుబాటి మొన్నటి ఎన్నికలకు ముందే వైసిపిలో చేరారు. పర్చూరు అసెంబ్లీకి పోటి చేసిన దగ్గుబాటి ఓడిపోయారు. అప్పటి నుండి వైసిపిలో పెద్దగా యాక్టివ్ గా లేరన్నది నిజం. తాజాగా టిడిపిలో నుండి రామనాధం బాబును వైసిపిలోకి చేర్చుకోవటంతో అందరిలోను ఆసక్తి పెరిగిపోయిం. రామనాధం వైసిపిలో నుండే టిడిపిలోకి వెళ్ళారు.

 

టిడిపిలోకి వెళ్ళిన రామనాధం మళ్ళీ వైసిపిలోకి ఎందుకు వచ్చారు ? అన్నదే సర్వత్రా ఆసక్తిగా మారింది. ఆయనంతట ఆయనే వచ్చారా ? లేకపోతే జగన్మోహన్ రెడ్డే పిలిపించారా ? అన్నదే సస్పెన్సుగా మారింది. స్ధానికంగా గట్టి నేతయిన రామనాధం పార్టీలోని నేతలతో పడని కారణంగానే టిడిపిలోకి వెళ్ళిపోయారు. అలాంటిది పార్టీ అధికారంలోకి రాగానే తిరిగి వైసిపిలోకి వచ్చేయటం వెనుక కీలక నేత హస్తముందనే అంటున్నారు.

 

సరే రామనాధం పార్టీలోకి రావటం సంగతిని పక్కన పెట్టినా దగ్గుబాటి కూడా ఏమంత యాక్టివ్ గా లేరనే చెప్పాలి. దగ్గుబాటితో పాటు కొడుకు హితేష్ చెంచురామ్ కూడా పార్టీలో పెద్దగా కనబడటం లేదు. అదే సమయంలో జగన్ ను టార్గెట్ చేస్తు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపణలు చేస్తునే ఉన్నారు.

 

భార్య, భర్తలు చెరో పార్టీలో ఉండటం వల్ల  వచ్చే సమస్యలేంటో అందరూ చూస్తున్నదే. ఎలాగూ తొందరలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి దగ్గుబాటిని నమ్ముకునే కన్నా రామనాధంను తిరిగి పార్టీలో చేర్చుకుంటేనే బాగుంటుందని జగన్ అనుకున్నారేమో.  అదే నిజమైతే దగ్గుబాటిని పొమ్మనకుండానే పొగబెడుతున్నట్లే అనుకోవాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: