అతనొక మచ్చలేని నాలుగు దశాబ్ధాల రాజకీయ అనుభవమున్నవారుగా తనకు తాను చెప్పుకుంటారు. ఆయితే అలాంటి అకళంక నాయకునిపై లోకాయుక్తకు పిర్యాదు అంటే ఆ వార్త సహజంగా సంచలనమే! ఇప్పటిదాకా మూడుసార్లు ముఖ్యమంత్రిగా మూడుసార్లు శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా తెలుగునేల నలుచెఱగులనేలిన ఈయన తనను తాను మచ్చలేని "నిప్పు" నని చెప్పుకోవటం తెలుగు ప్రజల్లోని ఏ పసి బాలుడినైనా అడిగితే తెలుసని టక్కున చెపుతారు. నిప్పు అంటే చాలు పసివాడికైనా పరిచయం అక్కర్లేదు.  

రాజకీయాల్లో మచ్చలేని నేతనంటూ చెప్పుకుంటున్న టీడీపీ అధినేత - ఏపీ మాజీ సీఎం - ఏపీ అసెంబ్లీలో ప్రస్తుత ప్రతిపక్షనేత నారా  చంద్రబాబునాయుడితో పాటు ఆయన కుమారుడు – ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఐటీ శాఖామాత్యులు నారా లోకేశ్ బాబు లపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఏపీ లోకాయుక్తకు ఒక పిర్యాదు అందిందట. 

త్వరలోనే ఈ కంప్లైంట్ పిటిషన్ పై నేఱ విచారణకు కూడా లోకాయుక్త నుండి ఆదేశాలు వెలువడే అవకాశాలు లేకపోలేదని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ పిటిషన్  తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో పెను సంచలనమే రేపొచ్చని అంటున్నారు.

బీసీ వర్గానికి చెందిన డేరంగుల ఉదయ్ కిరణ్ ఏపీ లోకాయుక్తలో బాబు ద్వయంపై ఫిర్యాదు చేశారట. గత  ఐదేళ్ల పాలనాకాలంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారం చెలాయించి న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనతో పాటు ఆయన మంత్రి మండలిలో కీలక మంత్రిగా – తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన నారా లోకేశ్ బాబు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నది ఫిర్యాదుదారుడి వాదన. 

చంద్రబాబు అధికారంలో ఉండగా— చంద్రబాబు - లోకేశ్ బాబులే కాకుండా చంద్రబాబు కేబినెట్ లోని అనేకమంది మంత్రులు, అధికార టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని నిట్టనిలువునా అందినకాడికి దోచుకుని దాచుకున్నారని కూడా ఆ పిర్యాదీదారుని ఆరోపణ.  

ఇసుకలో దోపిడీ -
రాజధాని నిర్మాణంలో అక్రమాలు -
పోలవరం ప్రోజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు –
ఆరంభం నుండి అధికారాంతం వరకు నిర్విరామంగా జరిగిన ఆర్ధిక దుర్వినియోగం
కన్నుమిన్ను కానక బహుముఖంగా మిన్నంటిన దుబారా

మొదలైన వాటి వెనుక ముందూ వీరి హస్తం ఉందని తెలిపారట. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని - వారిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని పిర్యాదులో కోరారట. విచారణ తరవాత టీడీపీ నేతల అవినీతి సంపాదనను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కూడా పిర్యాదీదారుడు డిమాండ్ చేశారట.  

ఈ వాదనలో నిజానిజాల విషయం ప్రస్తుతం అప్రస్తుతం కాగా! లోకాయుక్తకు అందిన ఫిర్యాదులపై విచారణ జరిగే అవకాశాలు మాత్రం  పుష్కలం.  ఈ నేపథ్యంలో ఇప్పుడు బాబోర్లపై విచారణ జరగడం పక్కాయేనా? అంటూ సర్వత్రా విశ్లేషణలు మొదలయ్యాయి. 

కర్ణాటకలో రాజకీయ నేతల అవినీతిపై విచారణ చేపట్టిందే లోకాయుక్తే  కదా! ముఖ్యమంత్రి, మంత్రులపైనా లోకాయుక్త పరిధిలో విచారణ జరిగింది నిజమే కదా! తాజాగా ఏపి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుని  పాలనా కాలంలో మంత్రులుగా కొనసాగిన వారితో పాటు వారి తనయుడు మంత్రి -  అధికార పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అధికార చట్రం మద్యలో ఉండటమే కాదు చట్రం పరిది దాటి చక్రం తిప్పిన లోకేశ్ బాబుపై లోకాయుక్తకు ఫిర్యాదు వచ్చినందున  దానిపై విచారణ జరిగే అవకాశాలే అధికమని విశ్లేషకుల ఆసక్తికర వాదన. 


మరింత సమాచారం తెలుసుకోండి: