ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిపోయింది.   గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వైకాపా ప్రభుత్వం తప్పు పడుతున్నది.  ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో.  బాబు వస్తే జాబు  వస్తుంది అనే మాట అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది.  కానీ, బాబు వచ్చినా ఒక్క జాబు కూడా రాలేదని వైకాపా ప్రభుత్వం విమర్శలు చేస్తున్నది.  కాగా, దీనిపై తెలుగుదేశం పార్టీ నేత వైబీ రాజేంద్రప్రసాద్ స్పందించారు. 


ఉద్యోగాల కల్పనలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర యువతకు అరచేతిలో వైకుంఠం చూపుతోందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిలువునా మోస పుచ్చుతోందని అన్నారు. 4లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామంటూ డబ్బా కొట్టుకోవడం తప్ప అందులో ఒక్క ప్రభుత్వ ఉద్యోగమూ కల్పించలేకపోయిందని తెలిపారు. గ్రామ సచివాలయ నియామకాల పరీక్ష నిర్వహణ పేరిట నిబంధనలకు నీళ్లొదిలేసిన లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడిందని  ఎద్దేవా చేశారు. 

గ్రామ, వార్డు వాలంటీర్ల విషయంలోనూ రోజుకు సగటున రూ.166 మాత్రమే ముట్టజెపుతూ.. వారిని రోజువారీ కూలీల కంటే హీనంగా చూస్తోందని అన్నారు. వాస్తవానికి 5లక్షల నిజమైన ఉద్యోగాల భర్తీ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని తెలిజేశారు.  చంద్రబాబు గారి హయాంలో 39,450 పరిశ్రమలు ఏర్పాటు చేసి 5,13,351 మందికి ఉద్యోగాలు కల్పించారని అసెంబ్లీ వేదికగా శాసనమండలిలో మంత్రి గౌతమ్‌ రెడ్డి తెలిపారని అన్నారు. లిఖితపూర్వకంగా కాగితంపై ఇచ్చిన లెక్కలు.. పైగా చట్టసభలో మంత్రి నోటి వెంట వచ్చిన నిజాలే అందుకు సాక్ష్యం అని వైబీ పేర్కొన్నారు.

ఈ విషయం సభలో ఉన్న ఇతర మంత్రివర్యులు, ముఖ్యంగా మంత్రి కన్నబాబుకు తెలియకపోవడం బాధాకరం. తెలుగుదేశం ప్రభుత్వం ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిందని మీరే లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చి.. ఇప్పుడు ఎవరికీ ఉద్యోగం లభించలేదనీ ఎలా చెబుతారు? ''అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలి'', వాస్తవాలు వ్రకీకరించి చెబితే అవి చివరకు మీ మెడకే చుట్టుకుంటాయని పేర్కొన్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: