13 జిల్లాల ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్లు, డిస్ట్రిబ్యుటరీ కమిటీ ఛైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం గుంటూరులో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ...  నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా గత ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా చెరువుల పూడికతీత, పంటకుంటల నిర్మాణం, చెక్‌ డ్యాంల నిర్మాణం వంటి నీటి సంరక్షణ చర్యలు చేపట్టామన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా నీరు చెట్టు పథకం కింద రూ.18,625 కోట్లు వ్యయం చేసి 93 కోట్ల ఘనపు మీటర్ల పూడిక మట్టిని బయటకు తీశామన్నారు. దీని ద్వారా దాదాపు 90 టీఎంసీల నీటిని అందించి 7.30 లక్షల ఎకరాలకు అదనపు ఆయకట్టును అందిందన్నారు. గత ప్రభుత్వం నీరు-చెట్టు వంటి వినూత్న పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడం ద్వారా జలవనరుల శాఖకు దాదాపు 32 అవార్డులు వచ్చాయన్నారు. అంతేకాకుండా వాటర్‌ మేనేజ్‌మెంట్‌లో దేశంలో రెండో స్థానంలో ఉన్నామని నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకటించడం గర్వ కారణమన్నారు. 


13జిల్లాల్లో రూ.1,270 కోట్లు చిన్న, సన్న కారు రైతులు చేసిన పనులకు కలెక్టర్‌ అగ్రిమెంట్లు ఇచ్చినా ప్రస్తుత ప్రభుత్వం కావాలనే బిల్లులు ఆపుతూ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేపడుతున్న అనాలోచిత చర్యలకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దివాళా తీస్తున్నారన్నారు. ఆర్ధికంగా చితికిపోతున్నారు. వైకాపా కక్ష సాధింపుకు శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన గంగవరకు కొండారెడ్డి అనే కాంట్రాక్టర్‌ నీరు-చెట్టు పనులకు బిల్లులను కావాలనే ఆపడంతో అప్పుల బాధతో ఉరి వేసుకున్నారు.  జగన్‌ ప్రభుత్వం చేస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా ఎండకట్టేందుకు కమిటీలను ఏర్పాటు చేశారు.

అందులో రాష్ట్ర సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు, ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్లు మైనేని మురళీకృష్ణ గుంటూరు, భూపతిరాజు ఈశ్వరరాజు తూర్పుగోదావరి, గండి ముసలి నాయుడు విశాఖపట్టణం, ఆర్‌. సుందర్‌ రాంరెడ్డి నెల్లూరు, కర్రి అప్పారావు శ్రీకాకుళం సభ్యులను నియమించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, ప్రాజెక్టు కమిటి ఛైర్మన్లు గుంటుపల్లి వీరబుజంగ రాయులు, వై.పుల్లయ్య చౌదరి, గుత్తా శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: