తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు మాట‌కారిత‌నం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సంద‌ర్భం ఏదైనా ఆయ‌న త‌న‌దైన శైలిలో మాట‌ల‌తో ఆక‌ట్టుకుంటారు. తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఐటీ అంటే.. ఇండియా తెలంగాణ అని అభివర్ణించారు. ఐటీలో ఇండియాకు, తెలంగాణకు అంతగా అవినాభావ సంబంధం ఏర్పడిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారికి ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామన్నారు. 


ఓ సంస్థ‌ డెలివరీ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణలో ఐటీ ఎగుమతుల్లో వృద్ధిరేటు ఎక్కువగా ఉందని చెప్పారు. జాతీయసగటు కంటే ఇక్కడ ఎక్కువ వృద్ధి ఉన్నదని, బెంగళూరు కంటే కూడా ఎగుమతులు ఎక్కువ ఉన్నాయని పేర్కొన్నారు. పరిశ్రమలకు అవసరమైన మానవవనరులను తీర్చిదిద్దడానికి టాస్క్ ద్వారా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఎంఫసిస్ వంటి అంతర్జాతీయసంస్థ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరిస్తున్నదని, దీనిద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. అమెరికా వెళ్లటానికి మన యువతకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడే ఉండి సేవలు అందించడానికి ముందుకొస్తున్నారని, ఈ నేపథ్యంలో అందుబాటులో అద్భుతమైన మానవవనరులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. కంపెనీలకు అవసరమైనవిధంగా విద్యార్థులను, యువతను తీర్చిదిద్దటానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని చెప్పారు.


హైదరాబాద్ నగరం పెట్టుబడులకు ఎంతో అనువైనదని ఎంఫసిస్ డైరెక్టర్ నితిన్‌రాకేశ్ అన్నారు. మూడేళ్ల క్రితం త‌మ కార్యాలయానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారని, ఈ మూడేళ్ల‌లో ఉద్యోగుల సంఖ్య దాదాపు మూడింతలు పెరిగిందని సంతోషం వ్య‌క్తం చేశారు. కాగా, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రిగా కే తారకరామారావు బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి పరిశ్రమలశాఖలో వేగం మరింత పెరిగింది. అక్టోబర్ మొదటివారం నుంచి వారానికి ఒక కార్యక్రమం ఏర్పాటుచేసుకుని ముందుకు సాగనున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: