నీలోఫర్ క్లినికల్ ట్రయల్స్ దుమారంపై ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో విచారణ కమిటిని నియమించింది.  చిన్న పిల్లల ఆసుపత్రిగా ప్రఖ్యాతి గాంచిన నీలోఫర్ ఆసుపత్రిలో క్లినియకల్ ట్రయల్స్ జరుగుతున్నాయనే విషయం వెలుగు చూడటంతో సంచలనం మొదలైన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన వందలాది పసికందుల్లో ఎంతమందిపై క్లినికల్స్ ట్రయల్స్ దుశ్చర్యకు డాక్టర్లు తెగబడ్డారో ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

వైద్యం కోసం వచ్చిన పిల్లల్లో ఎంతమందిపై ట్రయల్స్ చేశారో తెలీకపోవటంతో తల్లి, దండ్రులందరూ టెన్షన్ తో అవస్తలు పడుతున్నారు. ఆసుపత్రిలోని తల్లి, దండ్రులతో పాటు వారి కుటుంబసభ్యులు, బంధువులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మొత్తానికి జరిగిన ఘటనలు, జరుగుతున్న తతంగమంతా చూస్తుంటే ఆసుపత్రిలోని చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ జరిగాయనే అనుమానాలు బలపడుతున్నాయి.

 

ఎప్పుడైతే ట్రయల్స్ దురాగతం బట్టబయలైందో రాజకీయ దుమరం కూడా మొదలయ్యింది. అసలే తొందరలో హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగబోతోంది. దానికి ముందు బయటపడిన క్లినికల్ ట్రయల్స్ ఘటనతో కెసియార్ ప్రభుత్వానికి బాగా చెడ్డపేరు తేవటం ఖాయం. అందుకనే హడావుడిగా క్లినికల్ ట్రయల్స్ వ్యవహారాలను నిగ్గు తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో విచారణ కమిటిని నియమించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 

కొన్ని ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్న మందుల పనితీరు, ప్రభావాలు తదితరాలను పరిశీలించేందుకే సదరు కంపెనీలు చిన్నపిల్లలను టార్గెట్ గా చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. విషయం చాలా సున్నితమైనది కావటంతో విచారణ కమిటి నివేదికను సమర్పించేందుకు ప్రభుత్వం కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఇచ్చింది.

 

ఇదే సమయంలో ఘటనపై కేంద్ర హోంశాఖ కూడా దృష్టిని సారించింది. ఆరోపణలపై విచారించిన సమగ్ర నివేదికను ఇవ్వాలంటూ కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు. మొత్తానికి చిన్నపిల్లలపై క్లినికల్ ట్రయల్స్ అనే ఘటన రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపేట్లుంది. మరి ఆ ఘటన నుండి కెసియార్ ఎలా బయటపడతారో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: