బోసి నవ్వుల చిన్నారులను, చిన్న పిల్లలను పువ్వుల్లా ప్రేమగా చూడాల్సిన డాక్టర్లే వారిని బొమ్మలుగా చూస్తుంటే ఏమనాలి. చిన్నారులకు ఏ చిన్న నలతగా ఉన్నా వారి లేత శరీరాల్ని సున్నితంగా పరిక్షించాల్పిన వైద్యులు వారిలో ప్రయోగశాలను చూస్తే వారిలాంటి కర్కశ మనస్తత్వం ఉన్నవాళ్లను ఏమనాలి. పిల్లల ఆస్పత్రిగా పేరు గాంచిన హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రి.. ఇలాంటి దారుణాలకు వేదికగా మారుతుంటే ఇంతకంటే దాష్టీకం ఉండదేమో.

 


తమ చిన్నారులకు చిన్న నలతగా ఉంటేనే తల్లడిల్లిపోయే తల్లిదండ్రులు.. వారి చిన్నారులపై పలు ప్రయోగాలు జరుగుతున్నాయని తెలిస్తే తట్టుకోగలరా. వారి ముద్దు మురిపాలు చూసి మురిసిపోయే అమ్మా, నాన్నలకు వాళ్లొక ప్రయోగశాలగా మారిపోతున్నారంటే వారి బాధకు అంతు ఉంటుందా. ఇద్దరు డాక్టర్లు వారి వ్యాపార లావేదీల్లో జరిగిన గొడవల్లో ఈ అరాచకం బయటకు వచ్చిందంటే ఏమనాలి. వారి మధ్య సత్సంబంధాలు ఉంటే మరెంతమంది చిన్నారులు వారికి ల్యాబ్ లుగా మారిపోయేవారో తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. సున్నితమైన తమ శరీరాల నుంచి రక్తం తరలిపోతోందని తెలియని ఆ చిన్నారుల గురించి తలస్తే ఆ డాక్టర్లు ఆ పనులు చేయగలరా. ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాక అటువంటి వారిపై ఏ చర్యలు తీసుకుంటే వారు మారతారు. వారి స్వలాభానికి బొమ్మలుగా చూసిన చిన్నారుల ఆరోగ్యాన్ని వారు తిరిగి ఇవ్వగలరా.

 


ప్రభుత్వం ఇటువంటి దారుణాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఇంటర్మీడియట్ విద్యార్ధుల ఆత్మహత్యలు ఎంత హృదయవిదారకరమో.. చిన్నారుల శరీరాలను ల్యాబ్ లుగా మర్చేస్తున్న ఇటువంటి దురాగతాలూ అంతే దారుణం. తమ చిన్నారులు ఇలాంటి స్వార్థపరులకు ప్రయోగశాలగా మారిపోయారనే తల్లిదండ్రుల బాధను ఏం చేసినా తిరిగివ్వలేం. ప్రభుత్వం ఏమాత్రం మీనమేషాలు లెక్కపెట్టకుండా ఇటువంటి డాక్టర్లపై, ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇటువంటి దారుణాలు జరుగకుండా ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: