ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్యుల నిర్లక్ష్యం ఆ వ్యక్తి పాలిట శాపమైంది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఘటన సామాన్యులు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటేనే భయపడేలా చేస్తోంది. రాజు అనే యువకుడు విజయవాడ నగరంలోని ఒక దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఒక బైక్ యాక్సిడెంట్ లో రాజు కాలుకు గాయమైంది. ఆ గాయం కోసం రాజు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. 
 
ఆస్పత్రిలో వైద్యుడు రాజు కాలికి అయిన గాయాలకు కుట్లు వేశాడు. ఆ తరువాత అతని రెండు చేతులకు రెండు ఇంజక్షన్లు ఇచ్చాడు. చికిత్స తరువాత రాజు ఇంటికి వెళ్లాడు. కొన్ని రోజుల తరువాత రాజు ఎడమ చేతిలో ఎలాంటి చలనం లేకుండా ఉండటం గమనించాడు. చేతిలో చలనం లేకపోవటంతో భయపడిన రాజు చికిత్స చేసిన వైద్యున్ని సంప్రదించాడు. వైద్యుడు రాజుకు ఏమీ కాదని చెప్పి సాధారణంగా చేతులు విరిగిన వారికి కట్టే కట్టును రాజుకు కట్టి పంపించాడు. 
 
ఆ కట్టు కట్టిన తరువాత కూడా రాజు చేతిలో ఎటువంటి మార్పు రాలేదు. రాజు చేసే పనికి కూడా చేతి సమస్య వలన ఇబ్బందులు ఎదురయ్యాయి. రాజు పనిచేసే షాపు యజమాని రాజు పరిస్థితిని గమనించి ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొనివెళ్లాడు. అక్కడ వైద్యులు రాజును పరీక్షించి కండరానికి చేయాల్సిన ఇంజక్షన్ నరానికి చేయటంతో చెయ్యి పని చేయటం లేదని షాకింగ్ న్యూస్ చెప్పారు. 
 
ఆపరేషన్ చేస్తే చెయ్యి బాగు అయ్యే అవకాశం ఉన్నా ఆపరేషన్ గుండెకు ప్రమాదకరం అని వైద్యులు చెప్పటంతో షాక్ అవటం రాజు వంతయింది. విషయం తెలిసిన రాజు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని సిబ్బందిని నిలాదీసినా వారు ఏ సమాధానం చెప్పలేదు. ప్రస్తుతం రాజు మరియు అతని కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులను కలిసి ఈ విషయం గురించి ఫిర్యాదు చేశారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: