నిలోఫర్ ఆస్పత్రిలో పసిపిల్లలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారని వివాదం మొదలైన విషయం తెలిసిందే. ఏ పాపం తెలియని పసి ప్రాణాలతో ఇక్కడి కొందరు వైద్యులు ప్రయోగాలు చేస్తూ పిల్లల బంగారు భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. ఈ హాస్పిటల్ పై వివాదాలు తొలిసారి కాదు. గతంలో కూడా ఈ ఆస్పత్రిని చాలా వివాదాలు చుట్టుముట్టాయి. జ్వరంతో బాధ పడుతున్న మూడు నెలల చిన్నారికి ఒక గ్రూప్ బ్లడ్ కు బదులుగా మరో గ్రూప్ రక్తాన్ని ఇక్కడి వైద్యులు ఎక్కించారు. 
 
వైద్యుల నిర్లక్ష్యానికి నిరసనగా బాధితులు ఆందోళన కూడా చేశారు. మరో సంఘటనలో ఐదుగురు బాలింతలు వైద్యం వికటించి మృతి చెందారు.వైద్యుల నిర్లక్ష్యం వలన బాలింతలు చనిపోయారని బాధితులు ఆవేదన చెందారు. మరో సంఘటనలో మూత్రం సమస్యతో హాస్పిటల్ లో చేరిన 11 నెలల సాయి అనే పిల్లవాడికి వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ చేసిన అనంతరం సాయి మృతి చెందాడు. 
 
ఆస్పత్రికి వెళ్లకముందు పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నాడని చెబుతూ బాలుడి తల్లిదండ్రులు రోదించారు. మరో సంఘటనలో ఒకే సిరంజితో 30 మంది చిన్నారులకు ఇంజెక్షన్  ఇచ్చారు. అలా చేయటంతో చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. 7 సంవత్సరాల క్రితం యూనిసెఫ్ నిలోఫర్ ఆస్పత్రిలో పిల్లల మరణాల సంఖ్య అసాధారణంగా ఉన్నట్లు నివేదిక ఇచ్చింది. వైద్యుల నిర్లక్ష్యంతో పసికందులు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. 
 
7 నెలల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన ఒక పసికందును 8 గంటల సమయంపాటు వైద్యులు పట్టించుకోకపోవటంతో ఆ పసికందు మృతి చెందింది. తాజాగా క్లినికల్ ట్రయిల్స్ విషయంలో మరోసారి నిలోఫర్ ఆస్పత్రి అప్రతిష్ట మూటగట్టుకుంటోంది. ఇక్కడి వైద్యులు పసి ప్రాణాలపై మందులు ప్రయోగిస్తూ కాసుల కక్కుర్తితో పిల్లల జీవితాల్ని నాశనం చేస్తున్నారు. ఏ పాపం తెలియని పసిప్రాణాలపై నిబంధనలకు విరుధ్ధంగా ప్రయోగాలు చేసిన వైద్యుల్ని కఠినంగా శిక్షించాలని కోరుకుందాం. 




మరింత సమాచారం తెలుసుకోండి: