నేటి వైద్యవృత్తి ఎలామారిందంటే దున్నపోతుని పింగాణి దుకాణంలోకి పంపినట్లైంది.అన్నట్లుగా ఉంది.కొందరి డాక్టర్ల వ్యవహరం ! ఇక ఆస్పత్రుల్లో దోపిడీ,నిర్లక్ష్యం ఎంత పెరిగిపోయిందో చెప్పడానికి నీలోఫర్‌లో జరిగిన ఘటన చాలు.ఒకప్పుడు ఎంతో పేరును స్వంతం చేసుకున్న నీలోఫర్ దవాఖాన,ఇప్పుడు కొందరు వైద్యులు కాసులకు కక్కూర్తిపడి చేసిన పనికి అపఖ్యాతిని మూటగట్టుకుని అబాసుపాలైంది.ఇక్కడున్న డాక్టర్స్ కొందరు ఆపద సమయంలో ఆదుకోవాల్సింది పోయి. అడ్డదారులు తొక్కుతున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి అనైతిక వైద్యానికి సిద్ధపడ్డారు.రోగుల ఆరోగ్యాన్ని కాపాడాల్సింది పోయి వారికి మరిన్ని చిక్కులు తెస్తున్నారు.



ఇప్పుడు నీలోఫర్‌ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డబ్బే పరమావధిగా వృత్తిలోకి వచ్చిన వారికి ప్రభుత్వం,మెడికల్‌ కౌన్సిల్‌ వంటి నిర్ణయాధికారం గల వారే గుణపాఠం చెప్పాలని ఎందరో కోరుకుంటున్నారు. ఇక మనలో చాలా మందికి ప్రాణాలు కాపాడే వైద్యుడు దైవంతో సమానం.అందుకే వైద్యోనారాయణో హరీ అంటూ కీర్తిస్తారు. ఆపదసమయంలో ఆదుకునే తెల్లకోటుకు ఎంతో విలువఇస్తారు కానీ.స్వచ్ఛమైన ఆ తెల్లకోటు నల్లబోయేలా కొందరి అనైతికత వ్యవస్థకే చెడ్డపేరు తెస్తోంది.కాసులయావలో గాడి తప్పిన డాక్టర్లు..మంచి చెడు విచక్షణ మరచిపోతున్నారు.



సొమ్ము చేతిలో పడగానే.బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ కడుపుకోత మిగుల్చు తున్నారు.చేతులారా నిండుప్రాణాలను బలి తీసుకుంటు చేతులు దులుపుకుంటున్నారు.కీర్తించిన జనాలతో చీత్కారాలు అందుకుంటున్నారు.వైద్య నియమావళిని అతిక్రమించి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నా.ఇటువంటి వారికి ఎప్పటికో గాని శిక్షలుపడవు.ఒకవేళ శిక్షలుపడ్డా అందులో ఏ ఒక్కరో ఇద్దరి పైనో నామ మాత్రంగా అధికార యంత్రాంగం కంటితుడుపు చర్యలు తీసుకుంటోంది.ఇదే అదనుగా, అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.దయాదాక్షిణ్యా లు..నిబంధనలు గాలికొదిలేసి లక్షలే లక్ష్యంగా తెగబడుతున్నారు.



ఇంకా ఎన్నాళ్లు వైద్యుల ధనదాహానికి అమాయకులు బలికావాలి.ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వైద్య వ్యవస్థను సక్రమ దారిలో నడిపేందుకు తెలంగాణ రాష్ట్ర వైద్యమండలి కఠిన నిర్ణయాలు తప్పక తీసుకోవాలి.అడ్డగోలు వైద్యంతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడే వారిపట్ల దయ,జాలి చూపకుండా ప్రవర్తించాలి.తెల్లకోటంటే అక్రమార్జనకు అడ్డా కాదని నిరూపించాలి.ఇక ఓ నీలోఫరా,నీతిమాలిన పనులు నీకు అవసరామా! అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: