వారం రోజుల క్రితం ఆర్బీఐ సరికొత్త ఏటీఎం నిబంధనలను తీసుకొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2.2 లక్షల ఏటీఎం యంత్రాలు ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలలో ఆర్బీఐ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలకు కొన్ని ముఖ్యమైన సూచనలను ఇచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఏటీఎం నుండి మనీ డ్రా చేసినపుడు ఏ కారణం చేతనైనా డబ్బు ఏటీఎం నుండి రాకపోతే తగిన గడువులోగా బ్యాంకు ఖాతాలోకి జమ కావాలి. 
 
లావాదేవీ జరిగిన రోజు నుండి 5 రోజుల లోపు డబ్బు సంబంధిత బ్యాంకు ఖాతాలో జమ కావాలి. 5 రోజుల కంటే ఆలస్యం అయితే రోజుకు 100 రూపాయల చొప్పున బ్యాంకులు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు సాధారణ ఏటీఎంలకు మాత్రమే కాక మైక్రో ఏటీఎంలకు కూడా వర్తిస్తాయి. ప్రస్తుతం చాలా బ్యాంకులు కస్టమర్లకు ఉచిత లావాదేవీలను పరిమితంగా అందిస్తున్నాయి. 
 
సాధారణంగా ఉచిత లావాదేవీలు పూర్తయిన తరువాత అదనపు లావాదేవీకి కొంత డబ్బు ఖాతా నుండి కట్ అవుతుంది. ఏటీఎంలో సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, కమ్యూనికేషన్ కారణాల వలన లావాదేవీ ఫెయిల్ అయితే కొత్త నిబంధనల ప్రకారం ఈ లావాదేవీలకు ఛార్జీలను వసూలు చేయకూడదు. ఏటీఎంలో పిన్ నంబర్ తప్పుగా నమోదు చేసినా కూడా సర్వర్లు ఆ లావాదేవీలను లెక్కలోకి తీసుకోకూడదు. 
 
ఏటీఎంలో నగదు లేకపోవటం వలన లావాదేవీ ఫెయిల్ అయితే ఆ లావీదేవీని లెక్కలోకి తీసుకోకూడదు. ఆ లావాదేవీకి ఎలాంటి డబ్బును వసూలు చేయకూడదు. ఏటీఎంలలో బ్యాలన్స్ తెలుసుకోవటం, మనీ వేరే ఖాతాకు పంపటాన్ని ఉచిత లావాదేవీలుగా కూడా పరిగణించకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు బ్యాంకు ఖాతాలు ఉన్నవారికి ఎంతో మేలు చేసే విధంగా ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: