నిలోఫర్ హాస్పిటల్ పేరు రోజురోజుకు మసకబారుతోంది. ఆ ఆస్పత్రిలో ఇంతకాలం వైద్యం చేయించుకున్న పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో ఆందోళన పడుతున్నారు. చికిత్స కోసం వచ్చిన తమ పిల్లలకు ఇక్కడి వైద్యులు ఎలాంటి మందులు ఇస్తున్నారో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులపై నిలోఫర్ ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ జరిగాయంటూ వార్తలు వస్తూ ఉండటంతో ఇంతకాలం చికిత్స చేయించుకున్న చిన్నారుల తల్లిదండ్రులలో తీవ్రమైన ఆవేదన వ్యక్తం అవుతుంది. 
 
అక్కడ ఎంతోకాలం నుండి పనిచేస్తున్న డాక్టర్ సుజాత అనే ఫ్రొపెసర్ నిలోఫర్ ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ ఎప్పటినుండో జరుగుతున్నాయని చెబుతున్నారు. గతంలో నిలోఫర్ ఆస్పత్రికి సూపరిండెంట్ గా ఉన్న రమేష్ రెడ్డి క్లినికల్ ట్రయల్స్ కోసం అనుమతులు ఇచ్చారని సుజాత తెలిపారు. ఆస్పత్రి వర్గాలు  2017 సంవత్సరంలో రమేష్ రెడ్డి నిలోఫర్ ఆస్పత్రికి సూపరిండెంట్ గా ఉన్నారని చెప్పారు. 
 
క్లినికల్ ట్రయల్స్ కొరకు రమేష్ రెడ్డి అప్పుడు అనుమతులు ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం రమేష్ రెడ్డి వైద్యవిద్యసంచాలకులుగా పని చేస్తున్నారని ఇప్పడు రమేష్ రెడ్డి ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు ఇవ్వటం ఆశ్చర్యంగా ఉందని చెబుతున్నారు. నిలోఫర్ లో చిన్నపిల్లల విభాగంలో పని చేసే డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ నిబంధనల మేరకే క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. 
 
ప్రభుత్వం నిలోఫర్ ఆస్పత్రిలో పిల్లలపై జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ పై పూర్తి విచారణ చేసి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సి ఉంది. క్లినికల్ ట్రయల్స్ చేసే వారు అన్ని అనుమతులు పొందుతున్నారా? తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారా? లేదా? అనే విషయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: