తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీని బలోపేతం చేయడానికి మంచీ చెడ్డా చూసుకోకుండా ఆరుగాలం కష్టపడుతూంటే తమ్ముళ్ళు మాత్రం రివర్స్ గేర్ వేస్తున్నారు. పార్టీ నుంచి జంప్ చేసేందుకు ముహూర్తాలు చూసుకుంటూ అధినేతకే షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వర్తమాన రాజకీయాల్లో జంపింగులు మామూలే అయినా టీడీపీ కష్టకాలంలో ఉన్నపుడు ఇవి ఒక్కలా బాధపెట్టవన్న సంగతి తెలిసిందీ. పైకి చంద్రబాబు  నాయకులు ఎంతమంది పోయినా ఫ‌రవాలేదు, మళ్ళీ తయారుచేసుకుంటామని నిబ్బరంగా చెబుతున్నా అంత సీన్ మాత్రం పసుపు పార్టీలో కనిపించడంలేదు.


ఇదిలా ఉండగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి విశాఖ టీడీపీ రూరల్ జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్న పంచకర్ల రమేష్ బాబు సైకిల్ దిగిపోవడం ఖాయమైంది. పంచకర్ల వైసీపీలోకి జంప్ చేయబోతున్న సంగతి తెలిసిందీ. ఈ మేరకు వైసీపీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. ఇక జగన్ సైతం బలమైన సామాజికవర్గానికి చెందిన కాపు నాయకుడు, డైనమిక్ లీడర్, నిజాయతీపరుడుగా ఉన్న రమేష్ బాబు చేరికకు ఓకే అనేశారట.


దాంతో మంచి ముహూర్తం కోసం పంచకర్ల‌ పెందుర్తి శ్రీ శారాదాపీఠం స్వామీజీ వద్దకు వెళ్ళారని టాక్. స్వామీజీ అక్టోబర్ 5 మంచి రోజు అని చెప్పారో ఏమో కానీ ఆ రోజున పార్టీ మారేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రజారాజ్యం నుంచి 2009 ఎన్నికల్లో పెందుర్తి నుంచి గెలిచిన పంచకర్ల తరువాత కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. ఇక 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఎలమంచిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.


2019 ఎన్నికల్లోనే ఆయన వైసీపీలోకి రావాలనుకున్నారు. అయితే ఆయన కోరుకున్న సీటు వైసీపీ ఇవ్వలేకపోవడం చేత టీడీపీ నుంచే పోటీ ఎలమంచిలిలో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆనాటి నుంచి పంచకర్ల టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేశారు. అయితే ఆయన మొదట్లో బీజేపీలో చేరుతారని వూహాగానాలు వచ్చినా చివరికి వైసీపీలోనే చేరారు.


పంచకర్ల రాజకీయ భవిష్యత్తుకు వైసీపీ  హైకమాండ్ భరోసా ఇవ్వడంతో ఆయన ఫ్యాన్ నీడకు చేరుతున్నారని అంటున్నారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగిన పంచకర్ల కాపు సామాజికవర్గంలో తన సత్తాను చాటుకుంటూ వస్తున్నారు. సౌమ్యుడిగా వివాదరహితునిగా పేరు గడించిన పంచకర్ల వైసీపీలో చేరడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్ అయితే టీడీపీకి పెద్ద దెబ్బగా భావించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: