వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేయడాన్ని వైసీపీ తీవ్రంగా ఖండించింది. వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కన్నా తీరును తప్పుబట్టారు. ప్రభుత్వాన్ని విమర్శించే ముందు కన్నా లక్ష్మీనారాయణ తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని అన్నారు. టీడీపీ విమర్శలను కన్నా భుజాన వేసుకుంటున్నారే తప్ప సొంత అభిప్రాయాలు కావని తేల్చేశారు. వైసీపీ విధానాలను కన్నా లక్ష్మీనారాయణ గమనించకుండా విమర్శలు చేయడం తగదన్నారు.

 


కోడెల కుటుంబం చేసిన అక్రమాలపై కన్నా ఎందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్నా కన్నా ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు. బీజేపీలో A టీమ్, B టీమ్ అని తయారయ్యాయని విమర్శించారు. పచ్చ పార్టీ భావాలను కమలం పార్టీ భుజాన వేసుకున్నట్టుగా ఉందని అన్నారు. కన్నాను పదవి నుంచి తొలగించాలని బీజేపీ అధిష్టానానికి నివేదికలు వెళ్లాయని.. ఆ పదవిని కాపాడుకునేందుకే ప్రభుత్వంపై అర్ధంలేని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అధిష్టానం దృష్టిని ఆకర్షించి తన పదవిని కాపాడుకునేందుకు కన్నా పన్నుతున్న కుయుక్తుల్లో భాగమే ఈ విమర్శలని ఆరోపించారు. దేవాదాయ భూములు లాక్కుంటున్నామన్న బీజేపీ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బాబు హయాంలో కనకదుర్గ గుడిలో క్షుద్రపూజలు చేశారని.. ఇవేమీ కన్నాకు కనిపించలేదా అని విష్ణు ప్రశ్నించారు.

 


పారదర్శకమైన ఇసుక విధానం తీసుకువచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో రెండు నెలల పాటు వర్షాలు కురిశాయని గుర్తు చేశారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కోసం వైఎస్ జగన్ చర్యలు చేపట్టారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సామాజిక న్యాయం చేస్తూ ప్రజల పక్షాన నిలబడిన విషయాన్ని కన్నా గుర్తించాలన్నారు. జగన్ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజలు బీజేపీ ఆరోపణలు నమ్మే స్థితిలో లేరన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: