ఏపీ మంత్రివర్గంలో అనుభవం ఉన్న నేతల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకరు. 1999,2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలినేని...దివంగత వైఎస్సార్ కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. అయితే తర్వాత వైఎస్సార్ మరణించడం, జగన్ కొత్త పార్టీ పెట్టడంతో కాంగ్రెస్ కు రాజీనామా చేసి అందులోకి వెళ్ళిపోయారు.  ఈ క్రమంలోనే 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా ఒంగోలు నుంచి విజయం సాధించారు. ఇక 2014 లో ఓటమి పాలైన బాలినేని...మొన్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు.


సీనియర్ నేత కావడం, జగన్ కుటుంబానికి దగ్గర వ్యక్తి కావడంతో ఏపీ మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆయనకు జగన్ విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణ శాఖల బాధ్యతలు అప్పగించారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు కావొస్తుంది. ఈ నాలుగు నెలల కాలంలో కొందరు మంత్రులు ఇంకా గాడిలో పడలేదు. మరికొందరు మంత్రులు తమ శాఖలపై పట్టు సాధించుకుని పాలనలో దూసుకెళుతున్నారు. ఈ సమయంలో మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకసారి పరిశీలిస్తే...ఆయన మంత్రిగా సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది.


నాలుగు నెలల సమయంలో ఆయన నిర్వర్తిస్తున్న శాఖల్లో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. మొదట రైతులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించారు. దీని వల్ల రాష్ట్రంలో 18.5 లక్షల రైతు కుటుంబాలకు ఉపయోగం కలిగేలా చేశారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి తక్షణ చర్యలు తీసుకున్నారు.


గత టీడీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లపై అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ.. సీఎం జగన్ సమక్షంలో విద్యుత్ పీపీఏలపై పునఃసమీక్షించేందుకు సిద్ధమయ్యారు. అయితే దీనిపై ఇటు టీడీపీ నుంచి అటు కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థల నుంచి అడ్డంకులు వచ్చిన ముందుకెళ్లడానికి రెడీ అయ్యారు. పైగా పీపీఏలపై హైకోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. పీపీఏల పునఃసమీక్ష వ్యవహారాన్ని ప్రభుత్వం కోరినట్టుగా ఏపీఈఆర్‌సీకి హైకోర్టు అప్పగించింది. రేట్లు ముట్టుకోకూడదన్న కంపెనీల వాదనను కోర్టు తోసిపుచ్చింది.


అటు పర్యావరణానికి హాని కలిగించే బాక్సైట్ తవ్వకాల రద్దుకు జగన్ నేతృత్వంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎమ్మెల్యేగా ఎన్నో ఏళ్ళు ఒంగోలుకు సేవ చేస్తున్న బాలినేని....ఈ సారి మరింత అభివృద్ది చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మంత్రిగా బాలినేని ప్రోగ్రెస్ రిపోర్ట్ బాగుందనే చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: