మొన్నటివరకు ప్రతిపక్షంలో కలిసికట్టుగా పని చేసిన వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చే సరికి హడావిడి చేయడం మొదలుపెట్టినట్లు కనబడుతోంది. ఎవరికి వారే ఆధిపత్య పోరు కనబరుస్తూ, సొంత నేతలతోనే కుమ్ములాటకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ ఈ కుమ్ములాటలు కనిపిస్తుంటే...రాజధాని జిల్లా గుంటూరులో మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కాకముందే గుంటూరు వైసీపీలో ముసలం ముదిరిపోయింది.


అధికారం వచ్చిన మొదట్లోనే చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజని, సీనియర్ నేత మర్రి రాజశేఖర్ ల మధ్య రచ్చ మొదలైంది. జగన్ మాటతో పోటీకి వెనక్కి తగ్గిన మర్రి...ఎన్నికల్లో విడదల గెలుపు కోసం కృషి చేశారు. కానీ గెలిచాక విడదల, మర్రిని పక్కనబెట్టేసింది. పైగా నియోజకవర్గంలో ఫుల్ డామినేట్ చేస్తోంది. దీంతో నియోజకవర్గంలో మర్రి వర్గం సెపరేట్ అయిపోయింది. ఇక ఏ విషయంలోనూ మర్రి వర్గానికి, విడదల వర్గానికి పడట్లేదు. ఇక ఇక్క‌డ న‌రసారావుపేట‌ ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయుల‌కు ర‌జ‌నీకి పొస‌గ‌డం లేదు.


వీరి రచ్చ తర్వాత తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ లకు గట్టిగా పడింది. నందిగం సురేశ్ తాడికొండ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో....అక్కడ డామినేట్ చేయడం మొదలుపెట్టారు. ఇసుక తవ్వకాలు పలు విషయాల్లో ఆయన అనుచరుల పెత్తనం పెరిగిపోయింది. దీంతో తన నియోజకవర్గంలో సురేశ్ పెత్తనం శ్రీదేవి సహించలేకపోయింది. ఆయనపై సీఎం జగన్ కూడా ఫిర్యాదు చేసింది. ఇది ఇక్కడితో ఆగిందా అంటే అది జరగలేదు. ఏదో కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్ విషయంలో శ్రీదేవి, సురేశ్ వర్గాలు కొట్టుకునేవరకు వెళ్లింది.


అయితే తాజాగా శ్రీదేవి, విడదల రజనిల మధ్య వివాదం చెలరేగింది.  తాడికొండ నియోజకవర్గంలో ఓ మసీదు నిర్మాణ కార్యక్రమంలో రజనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో శ్రీదేవికి మండింది. రజని అనుచరుల హడావిడిని తప్పుబడుతూ...ఏంటీ ఈ రచ్చ అంటూ రజని మొహం మీద అనేసి కార్యక్రమం మధ్యలో నుంచి వెళ్లిపోయింది. దీంతో రజని చాలా అవమానంగా ఫీల్ అయ్యారు.


అటు గుంటూరు వెస్ట్ లో వైసీపీ నేతలు చంద్రగిరి యేసురత్నం, లేళ్ళ అప్పిరెడ్డిలకు పడటం లేదు. ఇక పల్నాడు గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డికి...కొందరు ద్వితీయ శ్రేణి నేతలకు అంతర్గత యుద్ధం జరుగుతుంది. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని నేతలు కాసుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద గుంటూరు వైసీపీ నేతల మధ్య వార్ తారస్థాయికి చేరుకుందనే చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: