రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొలువు దీరిన త‌ర్వాత ప్ర‌తి నెలరాష్ట్రంలో పండుగ వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌తి నెలా ఏదొ ఒక కొత్త సంక్షేమ ప‌థ‌కాల‌తో జ‌గ‌న్ స‌ర్కారు దూసుకుపోతోంది. ఆగ‌స్టు నెల‌లో రాష్ట్రంలో నిరుద్యోగుల‌కు ఉద్యోగాల పండుగ ప్రారంభ‌మైంది. దాదాపు 4 ల‌క్ష‌ల మంది గ్రామ వార్డు వ‌లంటీర్ల నియామ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అదేస‌మ‌యంలో గ్రామ‌, వార్డు స‌చివాల‌య కార్య‌ద‌ర్శుల‌కు సంబంధించిన పండుగ కూడా వ‌చ్చింది.


దాదాపు ల‌క్షా 40 వేల మందిని నియ‌మించే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. అదేస‌మ‌యంలో రైతుల‌కు ఉచిత విద్యుత్‌ను 9 గంట‌ల‌కు పెంచే కార్యక్ర‌మాన్ని ప్రారంభించారు. ఇక‌, సెప్టెంబ‌రు విష‌యానికి వ‌స్తే.. ఇళ్లులేని పేద‌ల వివ‌రాల‌ను సేక‌రించే పండుగ‌ను ప్రారంభించారు. ప్ర‌తి నిరుపేద‌కు రాష్ట్రంలో సెంటున్న‌ర భూమిని ఇవ్వ‌డం లేదా ప‌ట్ట‌ణాల్లో అయితే, ఇళ్లు క‌ట్టించి ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అదే స‌మ‌యంలో శ్రీకాకుళంలో నాణ్య‌మైన బియ్యం ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఆటో, ట్యాక్సీ ఓన‌ర్ల‌కు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇచ్చే వైఎస్సార్ ప్రోత్సాహ కాలను కూడా ఈ నెల‌లోనే ప్రారంభించ‌డం గ‌మ‌నార్హం.


అదే స‌మ‌యంలో గ‌త నెల‌లో చేప‌ట్టిన ఉద్యోగ నియామ‌కాల‌ను ఈ నెల‌లో పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌, రైతు భ‌రోసాను కూడా ప్ర‌తిపాదించారు. విధివిధానాలు ప్ర‌క‌టించారు. ఇలా సెప్టెంబ‌రులో అనేక కార్య‌క్ర‌మాలకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం తెర‌దీసింది. ఇక‌, వ‌చ్చే నెల అక్టోబ‌రులో స‌హ‌జంగానే ప్ర‌జ‌లు ద‌స‌రా పండుగ చేసుకునేందుకు రెడీ అయ్యారు. అయితే, దీనికితోడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనేక పండ‌గ‌ల‌ను చేస్తోంది. ప్ర‌ధానంగా అక్టోబ‌రు 1 నుంచి మ‌ద్యం దుకాణాల సంఖ్య 20శాతం వ‌ర‌కు త‌గ్గిపోనుంది. అదేస‌మ‌యంలో ప్రైవేటు వైన్ షాపులు ఇక ఉండ‌బోవు. అన్నీ ప్ర‌భుత్వ దుకాణాలే ఉంటాయి. వీటి టైమింగ్స్ కూడా మారిపోతున్నాయి. దీంతో మ‌ద్య నిషేధానికి జ‌గ‌న్ స‌ర్కారు తొలి అడుగు వేసిన‌ట్టు అయింది.


ఇక‌, అక్టోబ‌రు 2 నుంచి గ్రామ స్వ‌రాజ్య స్థాప‌న‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ‌, వార్డు పాల‌న ప్రారంభం అవుతోంది. అదేస‌మ‌యంలో అదే నెల 15 నుంచి రైతు భ‌రోసా కింది రైతుల‌కు రూ.12500 ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించనున్నారు. ఇలా ప్ర‌తి నెలా జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాష్ట్రంలో సంక్షేమ పండ‌గుల‌కు తెర‌దీస్తున్న విధానం చూస్తున్న ప‌క్క‌రాష్ట్రాల నాయ‌కులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే, కొస‌మెరుపు ఏంటంటే.. ఎక్క‌డా జ‌గ‌న్ ప్ర‌భుత్వం డ‌బ్బా కొట్టుకోకుపోవ‌డ‌మే! అతి ప్ర‌చారం అన‌ర్ధ‌మ‌ని భావించారో ఏమో.. పెద్ద‌గా ప్ర‌చారం చేసుకోకుండానే ప్ర‌జ‌ల హృద‌యాల్లో చోటు కోసం జ‌గ‌న్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: