మూడు రాష్ట్రాల పోలీసులు మహిళా మావోయిస్టు నేత అరుణ కోసం వెతుకుతున్నారు. ఆపరేషన్ లివిటిపుట్టు కీలక సూత్రధారిగా ఉన్న అరుణ కోసం విశాఖ మన్యాన్ని జల్లెడ పడుతున్నారు పోలీసులు. రెండుసార్లు అరుణ టార్గెట్ గా జరిగిన ఎన్ కౌంటర్లలో ఆమె తప్పించుకుంది. ఈ శనివారం జరిగిన కూంబింగ్ లో కూడా మావోయిస్టు భవాని గాయాలతో పోలీసులకు చిక్కింది. అరుణ సహా ఇతర అగ్రనేతల కోసం వేట కొనసాగుతోందని పోలీసులు ప్రకటించారు. 


అరుణ అలియాస్ వెంకటరవి చైతన్య....ఈ పేరు మూడు రాష్ట్రాల పోలీస్ రికార్డ్స్ కు సుపరిచితం. సరిగ్గా ఏడాది క్రితం అరుణ పేరు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఎ....దృష్టిలో పడింది. ఆపరేషన్ లివిటిపుట్టు వెనుక కీలక సూత్రధారి అరుణే. భర్త, మావోయిస్టుపార్టీ రాష్ట్రకమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతిసారధ్యంలో పకడ్భందీగా ఆపరేషన్ ముగించినట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు. 


అరుణ కుటుంబానిది సుదీర్ఘ ఉద్యమ నేపథ్యం. విశాఖనగరం పరిధిలోని పెందుర్తి ప్రాంతంలో అరుణ కుటుంబం నివసిస్తోంది. తండ్రి లక్ష్మణరావు రిటైర్డ్ టీచర్. అరుణ సోదరుడు ఆజాద్ ఉద్యమంలోనే అమరుడయ్యాడు. కొయ్యూరు మండలం పాలసముద్రం దగ్గర జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించాడు. అరుణ, చలపతికి సంబంధించిన లేటెస్ట్ సెల్ఫీ బయటపడింది. తర్వాత ఏవోబీలోని రామగూడ దగ్గర చోటు చేసుకున్న భారీ ఎన్ కౌంటర్ లలో కీలక నాయకత్వం సహా 31మందిని కోల్పోయింది. 


నందపూర్ ఏరియా బాధ్యతలను నిర్వహిస్తున్న అరుణకు కిడారి, సివేరిల వ్యవహారాన్ని అప్పగించింది మావోయిస్టు పార్టీ.  వరుస ఘటనలలో లివిటిపుట్టు ఆపరేషన్ సభ్యులు పోలీసు తూటాలకు బలవుతూ వచ్చారు. అప్పటి నుంచే అరుణను లక్ష్యంగా చేసుకుని భద్రతా బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 21 నుంచి మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు జరుగుతున్నాయి. అరుణ, చలపతి, రణదీప్ లాంటి అగ్రనేతలు విశాఖ మన్యంలో తిరుగుతున్నారు. మావోయిస్టులు ఎదుర్కొంటున్న నిర్భందంపైన ఇటీవల అరుణ ఆడియో టేపును మీడియాకు విడుదల చేసింది.


అరుణ తూర్పు-మల్కన్ గిరి డివిజన్ బాధ్యతలను నిర్వహిస్తోంది. ఆంధ్రా-ఒడిషా-చత్తీస్ ఘడ్-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో కార్యకలాపాలను విస్తరిస్తోంది. పోడు భూములు, కాఫీతోటలపై ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలను వ్యతిరేకిస్తూ....ఆదివాసీలను సంసిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారనే సమాచారం పోలీసుల దగ్గర వుంది. విశాఖ మన్యంలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు.. బుల్లెట్ గాయాలతో మహిళా మావోయిస్టు భవాని అలియాస్ కళావతి పట్టుబడింది. అయితే అరుణ పట్టుబడిందని కొన్ని హక్కుల సంఘాలు చేస్తున్న వాదనలో నిజం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అడవిని జల్లెడపడుతున్న కూంబింగ్ పార్టీలకు అదనంగా మరిన్ని బలగాలు రంగంలోకి దిగాయి. అగ్రనాయకులు ఒడిశా వైపు వెళ్ళే సూచనలు ఉండటంతో జాయింట్ ఆపరేషన్ నడుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: