కౌసల్య వయస్సు కేవలం పదే పది సంవత్సరాలు. ఇంత చిన్న వయస్సులో కౌసల్య నీటిగుంటలో పడిన ఇద్దరు పసి పిల్లల్ని రక్షించింది. కానీ దురదృష్టవశాత్తు ఆ నీటిగుంట కౌసల్య ప్రాణాన్ని బలి తీసుకుంది. చిత్తూరు జిల్లా గోపాలపురంలో జరిగిన ఘటనతో ఊరంతా విషాదచాయలు అలుముకున్నాయి. 

చిత్తూరు జిల్లా తొండవాడ పంచాయతీ గోపాలపురం ఎస్టీ కాలనీలో కౌసల్య అనే బాలిక అవ్వాతాతల దగ్గర ఉండేది. చిన్నతనంలోనే కౌసల్య తల్లిదండ్రులను కోల్పోయింది. కౌసల్య ప్రస్తుతం గోపాలపురంలోని ఒక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది. పాఠశాలకు దసరా సెలవులు ఇవ్వటంతో కౌసల్య పిన్ని పిల్లలు కిరణ్(5), మల్లీశ్వరితో(7) కలిసి ఆడుకోవటానికి ఇంటికీ సమీపంలో ఉన్న నీటిగుంట దగ్గరకు వెళ్లింది. 
 
కొంత సమయం తరువాత కౌసల్య ఇద్దరు పిల్లలు నీటిగుంటలో మునిగిపోతూ ఉండటం గమనించింది. వెంటనే ఇద్దరు పిల్లల్ని చేతులతో పట్టుకుని పైకి లాగి కౌసల్య ఇద్దరు పిల్లల్ని రక్షించింది. ఇద్దరు పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ వారికి రక్షించే క్రమంలో తీగలు కౌసల్య కాలుకు చుట్టుకోవటంతో కౌసల్య కాలు జారి నీటిగుంటలో పడింది. కాపాడుకోవటానికి ప్రయత్నించినా సాధ్యం కాకపోవటంతో కౌసల్య గట్టిగా కేకలు వేసింది. 
 
కేకలు విన్న స్థానికులు వెంటనే నీటిగుంట దగ్గరకు చేరుకున్నారు. నీటిగుంట నుండి బాలికను ఒడ్డుకు తీసుకొనివచ్చారు. అప్పటికే బాలిక అపస్మారక స్థితిలో ఉండటంతో స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి బాలికను తీసుకొనివెళ్లారు. కౌసల్యను పరీక్షించిన వైద్యులు కౌసల్య ఆస్పత్రికి తీసుకొనివచ్చే సమయానికే మృతి చెందినట్లు చెప్పారు.కౌసల్య మృతితో గోపాలపురం ప్రాంతం అంతా విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రాణాలకు తెగించి ఇద్దరు పిల్లల్ని నీటిగుంట నుండి రక్షించిన కౌసల్య అదే నీటిగుంటలో మునిగిపోవటం ఎంతో హృదయవిదారకమైనది. ఆడుకోవటానికి వెళ్లిన కౌసల్య మృతి చెందటంతో కౌసల్య అవ్వాతాత బోరున రోదిస్తున్నారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: