తెలంగాణ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా యంచ ఫ్లోరైడ్ పంప్ హౌస్ వద్ద మొక్కలు నాటారు. ఈ మొక్కలు మేకలు, గొర్రెలు మేయకుండా జాగ్రత్త వహించాలని దండోరా కూడా వేయించారు. నందిగామ గ్రామంలోని గొర్రెల కాపరి గిర్మన్నకు చెందిన మూడు మేకలు హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను తిన్నాయి. మొక్కలను మూడు మేకలు మేయడంతో యంచ గ్రామ కార్యదర్శి ఇఫ్తెకారుద్దీన్ 1500 రూపాయల జరిమానా విధించారు. 
 
ఈ జరిమానా డబ్బులను గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేశారు. నాళేశ్వర్ ప్రాంతంలో రోడ్డుపై ప్లాస్టిక్ వ్యర్థాలను వేసినందుకు ఒక హోటల్ యజమానికి 500 రూపాయలు మరో హోటల్ యజమానికి 200 రూపాయలు జరిమానా గ్రామ పంచాయతీ అధికారులు విధించారు. భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో హరితహారం మొక్కలను గేదె మేయడంతో 2000 రూపాయల జరిమానా విధించారు. 
 
ఎడపల్లి మండల కేంద్రంలో మొక్కలను మేకలు మేయడంతో గ్రామ పంచాయతీ అధికారులు షేక్ హైదర్ అనే వ్యక్తికి 1000 రూపాయలు జరిమానా విధించారు. కల్యాపూర్ గ్రామంలో రోడ్డుపై గేదెలను కట్టేసిన గేదెల యజమానులకు 500 రూపాయల చొప్పున జరిమానా విధించారు. గ్రామ పంచాయతీల నుండి మూడు నెలల క్రితం నోటీసులు ఇచ్చినా ఎటువంటి మార్పు లేకపోవటంతో జరిమానా విధించామని అధికారులు చెబుతున్నారు. 
 
కొన్ని రోజుల క్రితం హరితహారం కింద నాటిన మొక్కలను మేకలు తిన్నాయని వరంగల్ జిల్లా ఇల్లందలో 37,500 రూపాయలు జరిమానా విధించారు. హరితహారంలో నాటిన 150 మొక్కలను తినటంతో భారీ మొత్తంలో జరిమానా విధించారు. జరిమానా 15 రోజుల గడువులోపు చెల్లించకపోతే పంచాయతీరాజ్ శాఖ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు ఆ వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తూ ఉండటంపై గొర్రెల, , మేకల యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: