హైద‌రాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల‌కు శుభ‌వార్త‌. హైటెక్‌సిటీలోని టెకీల క‌ల‌ నెర‌వేర‌నుంది. మెట్రోరైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయి. దీపావళి పండుగకు ముందు హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం ప్రాంతానికి మెట్రోరైలు రాకపోకలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే కారిడార్‌- 3లో నాగోల్‌ నుంచి హైటెక్‌సిటీవరకు రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, త్వరలో రాయదుర్గం వరకు నడుపనున్నారు. ఈ మేర‌కు మెట్రో వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. 


హైదరాబాద్‌ మెట్రోకే సొంతమైన సీబీటీసీ టెక్నాలజీ ద్వారా 90 సెకన్లకో రైలు నడిపించవచ్చని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. డిసెంబర్‌లో కారిడార్‌-2లోని జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మార్గాన్ని ప్రారంభిస్తామ‌న్నారు. ప్రస్తుతం మూడు కారిడార్ల కోసం 56 రైళ్లు ఉండగా, 45 రైళ్లు మెట్రో కారిడార్‌-1, 3లలో 800 ట్రిప్పులు నడుస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. గతంలో 15 నిమిషాలకో రైలు నడువగా, ప్రస్తుతం 5 నిమిషాలకు కుదించారు. హైటెక్‌సిటీ రివర్సల్‌ అందుబాటులోకి వచ్చాక ఫ్రీక్వెన్సీ పెంచి 5 నిమిషాలకో రైలు నడిపిస్తున్నారు. దీన్ని మూడు నిమిషాలకు తగ్గించనున్నారు. మూడు కారిడార్లలో రైళ్ల రాకపోకలు ప్రారంభమైతే ప్రయాణికుల సంఖ్య ప్రారంభమై 5 లక్షల నుంచి 10 లక్షలకు చేరుకొంటుందని అంచనా.


ఇదిలాఉండ‌గా, ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌ధాని కోల్‌కతాలో 1984 మొదటి మెట్రోరైలు ప్రారంభం కాగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తొమ్మిది మెట్రోలు నడుస్తున్నాయి. మనది పదో మెట్రోగా రికార్డుల్లో చేరింది. అయితే, ప్రారంభంలోనే మెట్రో ప్ర‌త్యేక‌త‌ను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. నాగోల్-మియాపూర్ మధ్య 30 కిలోమీటర్ల మేర ఆపరేషన్స్ మొదలుపెట్టి దేశంలోనే అతిపెద్ద మార్గంలో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించిన మెట్రోగా రికార్డు సొంతం చేసుకుంది.  13.4 కిలోమీటర్ల ప్రారంభ ఆపరేషన్స్‌తో కొచ్చి మెట్రో నెలకొల్పిన రికార్డును మన మెట్రో తుడిచిపెట్టింది. త్వ‌ర‌లో కీల‌క‌మైన మెట్రో రూట్‌ను అందుబాటులోకి తేనుంది. దీంతో హైద‌రాబాద్ టెకీల‌కు పెద్ద ఉప‌శ‌మ‌నం ద‌క్క‌నుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: