ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధానమైన అంశం.. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపైనే. యురేనియం నిక్షేపాల తవ్వకాలకు కేంద్రం అనుమతులివ్వడం దగ్గర నుంచి మొదలైన రగడ సామాన్యుల నుంచి సెలబ్రిటీలు స్పందించే వరకూ వెళ్లింది. గిరిజనుల ఆరోగ్యం, వణ్యప్రాణుల మనుగడ, పర్యావరణ కలుషితం.. వంటి అంశాలతో సేవ్ నల్లమల అంటూ సోషల్ మీడియాలో ఓ చిన్నపాటి ఉద్యమమే మొదలైంది. ఈ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమయింది.

 

 

 

కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలపై పవన్ ట్వీట్ చేశారు. “ఆళ్లగడ్డ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. యురేనియం తవ్వకాలపై జిల్లా కలెక్టర్‌కు కూడా తెలియకపోవడం ఏమిటి? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం” అంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటు.. “నల్లమలను కాపాడుకుంటాం. అక్కడి స్థానికుల తరపున మా పోరాటం సాగిస్తాం. ప్రజలకు తోడుగా ఉంటాం” అంటూ ట్వీట్ చేశారు. నల్లమలను కాపాడుకుంటామంటూ విమలక్క పాడిన పాటతో పాటు.. యురేనియం డ్రిల్లింగ్ పనుల జరుగుతున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. నల్లమలలో తవ్వకాలు ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వంపై పెద్ద ఒత్తిడే వచ్చింది. యురేనియం తవ్వకాలకు అనుమతివ్వమంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగానే స్పందించింది. దీంతో ఈ తవ్వకాల సాధ్యాసాధ్యాలపై, పర్యావరణ పరిస్థితులపై కేంద్రం ఓ కమిటీని కూడా నియమించింది.

 

 

 

కానీ దీనిపై ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అంతా స్తబ్దుగా ఉందనుకున్న సమయంలో ఇప్పడు తవ్వకాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలపై పవన్ స్పందించడం రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. పవన్ ట్వీట్ పై.. యురేనియం తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయమేంటో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: