భారత తీర ప్రాంతాలకు ఉగ్రమూకల నుంచి ముప్పు పొంచి ఉందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. దేశంలో అస్థిర పరిస్థితులు సృష్టించేందుకు పాక్‌ కుట్రలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు నావికాదళం పూర్తి అప్రమత్తంగా ఉందన్నారు రాజ్‌నాథ్‌. 


ఇటీవలే యుద్ధ విమానం తేజస్‌లో విహరించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. తాజాగా పశ్చిమ తీరంలో ప్రయాణిస్తున్న ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యలో ఒక రాత్రంతా ఉన్నారు. నావికాదళం అధికారులు, సిబ్బందితో ముచ్చటించారు. దేశ రక్షణ కోసం నేవీ చేస్తున్న పలు పనులను... కార్యక్రమాలను... సాహసకృత్యాలను ప్రత్యక్షంగా వీక్షించారు కేంద్రమంత్రి. దేశ తీర ప్రాంతాన్ని సంరక్షించేందుకు నేవీ నిరంతరం కృషి చేస్తోందని.. ముంబై తరహా దాడులు భవిష్యత్‌లో జరిగే అవకాశం ఏమాత్రం ఉండబోదని  ఆయన ధీమా వ్యక్తం చేశారు. 


 కాకపోతే తీర ప్రాంతానికి ఉగ్రమూకల నుంచి ముప్పు పొంచి ఉందని చెప్పారు రాజ్‌నాథ్‌.  పాకిస్థాన్‌ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ.. భారత్‌లో అస్థిర పరిస్థితులు సృష్టించేందుకు  దాయాది కుట్ర చేస్తోందని మండిపడ్డారు కేంద్రమంత్రి. పుల్వామాలో ఉగ్రకదలికలపై స్పందించిన కేంద్రమంత్రి.. ముష్కర మూకలకు ఏ గతి పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యలో నిర్వహించిన యోగాసనాల కార్యక్రమంలో పాల్గొన్నారు రాజ్‌నాథ్‌.  సముద్ర జలాల్లో నేవీ సిబ్బందితో కలిసి ఆయన చేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి.  


ఇటీవలే జమ్మూకశ్మీర్ లో పెద్ద ఎత్తున అలజడి రేపేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రమూకలను భారత్ సైన్యం మట్టుబెట్టింది. ఓ ఇంట్లోకి చొరబడి ఓ వ్యక్తిన బంధీగా తీసుకొని బెదిరించే ప్రయత్నం చేసింది. అయితే వారి చెరలో నుంచి బంధీని క్షేమంగా బయటకు తీసుకొచ్చి దేశ ప్రజల ప్రశంసలు అందుకుంది భారత సైన్యం. చివరకు ముష్కరులు కాల్పులకు తెగబడటంతో ఎదురు దాడి చేసి వారిని అంతమొందించింది. అయినా ఉగ్రవాదుల్లో ఎలాంటి భయం కనిపించడం లేదు. ఎలాగైనా ఉగ్రమూకలను ఏరి పారేయాలని కంకణం కట్టుకుంది భారత్. 

మరింత సమాచారం తెలుసుకోండి: