వేలాది పాటలతో సంగీతాభిమానుల్ని అలరిస్తున్నఅలుపెరుగని కోకిల  లతా మంగేష్కర్. తొంభై ఏళ్లొచ్చినా ఆ గాన మాధుర్యంలో ఎలాంటి మార్పు లేదు. ఏ పాటకైనా తన స్వరంతో పట్టం కట్టే అపురూప గాయని లత 90వ జన్మదినం జరుపుకున్నారు. ఏడు దశాబ్దాలుగా కోట్లాది శ్రోతలను తన స్వర మాధుర్యంతో అలరిస్తున్న గాయని లతా మంగేష్కర్. నిత్యవసంతంలాంటి ఆ స్వరానికి భాషతో పనిలేదు. జాలువారే జలపాతంలా కాలం ఎరుగని ప్రవాహంలా సుదీర్ఘంగా సాగుతున్న గానమది. డ్యూయెట్...జానపదం...గజల్..ఖవ్వాలి ....భక్తి గీతం... ఎలాంటి పాటైనా కావచ్చు.  ఆమె గొంతులో అలవోకగా ఒదిగిపోవాల్సిందే. అంతకుమించి మరెవరూ న్యాయం చేయలేరనేలా.. ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తారు బాలీవుడ్ నైటింగేల్ లతా మంగేష్కర్.


1929 సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించిన లత, చిన్నప్పుడే తండ్రి దీనానాథ్ మంగేష్కర్ దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. ఆ తర్వాత ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసులు అమన్ అలీ ఖాన్, అమానత్ అలీ ఖాన్ దగ్గర శిష్యరికం చేసింది. 13 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోవడంతో అప్పటినుండే కుటుంబ పోషణ భారం లతాజీపై పడింది.హిందీ చిత్రసీమలో ప్రముఖ సంగీత దర్శకులందరితో పాడిన ఘనత లత సొంతం. ఎస్.డి. బర్మన్, ఆర్.డి. బర్మన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్ వంటి అగ్ర సంగీత దర్శకులందరితో లెక్కలేనన్ని పాటలు పాడారు లతా మంగేష్కర్. సినీ నేపథ్య గానంలో పోటీ లేదనిపించుకున్న లతా  మంగేష్కర్ కెరీర్ మహల్ సినిమాలో ఆయేగా ఆయేగా.. పాటతో మలుపు తిరిగింది. 


ఆగ్, శ్రీ 420, చోరి చోరి, హైవే నెంబర్ 44, దేవదాస్ వంటి చిత్రాలు లతాజీని బాలీవుడ్ లో తిరుగులేని గాయనిగా నిలబెట్టాయి.  1960లో నౌషాద్ అలీ సంగీతంలో వచ్చిన మొఘల్ఏ-ఆజమ్ సినిమాలో పాడిన ప్యార్ కియాతో డర్నా క్యా పాట లతా మంగేష్కర్ ఖ్యాతిని శిఖరాగ్రానికి  చేర్చింది. నాటి నుంచి నేటి వరకు అన్నితరాల హీరోయిన్ లకు సరిపోయే గళం ఆమె సొంతం.  తరాలు మారినా.. చెక్కు చెదరని ఆ స్వరానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తెలుగులో సంతానం సినిమా కోసం ఆమెతో పాడిన పాట తెలుగు ప్రేక్షకులను హాయిగా నిద్రపుచ్చింది. అంతేకాకుండా ఆఖరి పోరాటం సినిమాలో తెల్లచీరకు అనే పాట కూడా పాడింది లతామంగేష్కర్. 


లతామంగేష్కర్ ఎన్నో అవార్డులను అందుకున్నారు. 1948 నుంచి 1978 వరకు 50వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకుంది. గానకోకిల బిరుదును సొంతం చేసుకుంది. 1969లో పద్మభూషణ్, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారతరత్న, వంటి పురాస్కారాలతో భారత ప్రభుత్వం లతా మంగేష్కర్ ను సత్కరించింది. పురాస్కారాలన్నీ ఆ గాన మాధుర్యం ముందు దిగదుడుపే. 90వ జన్మదినం జరుపుకున్న లతామంగేష్కర్ కు దేశవ్యాప్తంగా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: