అవును మీరు చదివింది నిజ్జంగా నిజమే. ఎంఎల్ఏ ఏంటి బిక్షాటన చేయటమేంటి ? అని అనుకుంటున్నారా ? ఈ ఎంఎల్ఏ చేసిన బిక్షాటన తన సొంతానికి కాదు లేండి. తన నియోజకవర్గంలో నష్టపోయిన వరద బాధితులను ఆదుకోవటం కోసమే. అందుకే ఎంఎల్ఏ చేసిన పనికి నియోజకవర్గంలోని చాలామంది సానుకూలంగా స్పందించటమే కాకుండా శెహభాష్ అంటున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే, అనంతపురం జిల్లా చరిత్రలోనే ఎప్పుడూ లేనంత భారీ వర్షాలు కురిసిన విషయం అందరికీ తెలిసిందే. రిజర్వాయర్లు, కుంటలు, పిల్ల కాలువలు ఇలా ఒకటేమిటి అన్నీ వర్షపు నీళ్ళతో నిండి కళకళలాడుతున్నాయి. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.

 

ఇటువంటి భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో పంటలు, ఆస్తులు కూడా దెబ్బతిన్నాయి. అలా దెబ్బతిన్న ప్రాంతాల్లో తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలోని గ్రామాలు కూడా ఉన్నాయి.  సుమారు 600 కుటుంబాలకు తీవ్ర ఆస్తినష్టం జరిగిందని ఎంఎల్ఏ కేతిరెడ్డి పెద్దారెడ్డికి సమాచారం అందింది.

 

వర్షాలు ఇంకా కురుస్తున్న కారణంగా బాధితులకు ప్రభుత్వం నుండి సహయం అందాలంటే టైం పడుతుంది. అంత వరకూ వెయిట్ చేయాలంటే మరి బాధితుల పరిస్ధితేంటి ? అందుకనే పెద్దారెడ్డి వెంటనే రంగంలోకి దిగేశారు. అవసరమైన సాయం కోసం ప్రభుత్వం కోసం ఎదురు చూడకుండా తానే స్వయంగా సహాయ చర్యలు మొదలుపెట్టేశారు.

 

తన నియోజకవర్గంలోని బాధితులను ఆదుకోవటానికి ఓ పెద్ద జోలె పట్టుకుని భిక్షాటనకు దిగేశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో స్వయంగా ఎంఎల్ఏనే భిక్షాటనకు దిగటంతో జనాలు కూడా పెద్ద ఎత్తున స్పందించారు. నష్టపోయిన కుటుంబాల్లో ఎక్కువగా చేనేత రంగానికి చెందిన వారే ఉన్నారని సమాచారం.

 

నేరుగా ఎంఎల్ఏనే  బాధుతల సహాయం కోసం జోలె పడితే స్పందించని వారుంటారా ? అందుకనే ఎవరికి తోచిన విధంగా భారీ సహాయాలే చేశారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బాధితులను ఆదుకునే విషయంలో పెద్దారెడ్డి చూపిన చొరవను పార్టీ నేతలే కాకుండా మామూలు జనాలు కూడా బ్రహ్మాండం అంటున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: